కోవిడ్ 19 ఇపుడు జంతువులపైనా దాడి చేస్తోంది. కాలిఫోర్నియాలో కోవిడ్ -19 విధ్వంసం సృష్టిస్తోంది. మనుషులే కాదు ఇపుడు కోవిడ్ బాధిత జాబితాలో గొరిల్లాలు కూడా చేరాయి. శాన్ డియాగో జంతుప్రదర్శనశాలలో కనీసం రెండు గొరిల్లాలు కోవిడ్ -19 బారిన పడిన తరువాత మరో మూడింటిలో వైరస్ లక్షణాలు వున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గొరిల్లాలలో కరోనావైరస్ ఇదే మొదటిసారి అని జూ సిబ్బంది తెలిపారు. గత బుధవారం రెండు జూ గొరిల్లాల్లో దగ్గు ప్రారంభమైంది. ప్రాథమిక పరీక్షలో శుక్రవారం నాడు వాటికి వైరస్ ఉన్నట్లు తేలింది. యుఎస్ వ్యవసాయ శాఖ నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబొరేటరీ సోమవారం వాటికి పాజిటివ్ అని నిర్ధారించింది.
ఐతే కరోనావైరస్ గొరిల్లాల ప్రాణాలను హరించే శక్తి వుందో లేదో తెలియదంటున్నారు జూ యాజమాన్యం. ప్రస్తుతం వాటిని నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. కాగా గత డిసెంబరు నెల నుంచి జూని మూసివేసారు. మరోవైపు కాలిఫోర్నియా కోవిడ్ -19 కేంద్రంగా మారింది. సోమవారం ఐసియులో 4,971 మంది రోగులు ఉన్నారు. దేశవ్యాప్తంగా వారాంతంలో వైరస్ ఉన్న మొత్తం అమెరికన్ల సంఖ్య 22 మిలియన్లను అధిగమించిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల తెలియజేస్తున్నాయి. మరోవైపు ఇప్పటివరకూ 3,75,000 మందికి పైగా మరణించారు.