కరోనా కష్టాలు పలు విధాలుగా చుట్టుముడుతున్నాయి. లాక్‌డౌన్ ప్రకటించిన దేశాల్లో మద్యం లభించిక మందుబాబులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు కరోనా వైరస్ సోకి చనిపోతామన్న భయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా జర్మనీ దేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన ఓ ఆర్థిక మంత్రి ఒత్తిడిని భరించలేక సూసైడ్ చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, జర్మనీ దేశంలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రిగా థామస్ షాఫర్ ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం తప్పదంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జర్మనీలోని హెస్సే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయంతో ఆర్థికశాఖ మంత్రి థామస్ షాఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 54 ఏళ్ల షాఫర్ మృతదేహం ఫ్రాంక్ ఫర్ట్‌లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద పడివుండగా గుర్తించారు.
హెస్సే రాష్ట్ర ప్రీమియర్ వోల్కెర్ బౌఫీర్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నామని, ఇది తమను తీవ్ర విషాదానికి గురిచేసిందని బౌఫీర్ తెలిపారు.
హెస్సే రాష్ట్రం జర్మనీ దేశ ఆర్థిక కార్యకలాపాలకు గుండెకాయలాంటిది. హెస్సే ముఖ్యనగరం ఫ్రాంక్‌ఫర్ట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్యాంకులకు పుట్టినిల్లు. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటి ఇక్కడ వుంది. కరోనా వైరస్ ప్రభావంతో ఇక్కడి ఆర్థిక రంగ కార్యకలాపాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో విత్తమంత్రి ఆత్మహత్య చేసుకున్నారు.