కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతున్నా.. కేసుల సంఖ్య తగ్గట్లేదు. ఇదివరకు 10 వేలకు దిగువగా నమోదయ్యే కేసులు.. ఇప్పుడు 20 వేలకు చేరువగా వెళ్తున్నాయి. ప్రత్యేకించి మహారాష్ట్రలో భయానకంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. వేల సంఖ్యలో రోజువారీ కేసులు రికార్డవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలపైనా దాని ప్రభావం పడింది.
ఈ పరిణామాల మధ్య కర్ణాటకలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. కొత్త స్ట్రెయిన్ కేసు నమోదు కావడం కర్ణాటకలో ఇదే తొలిసారి. ఇప్పటిదాకా కర్ణాటకలో 29 బ్రిటన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శివమొగ్గ జిల్లాకు చెందిన వ్యక్తిలో కరోనా దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి.
ఇటీవలే బ్రిటన్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. కరోనా ప్రొటోకాల్ ప్రకారం.. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఆ నమూనాలను మరింత లోతుగా పరీక్షించారు.
వైరస్ జెనెటిక్ సీక్వెన్స్ ఆధారంగా అతనికి సోకింది దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌గా నిర్ధారించారు. వెంటనే ఆ వ్యక్తిని తొలుత సంస్థాగత క్వారంటైన్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.