కరోనా కష్టకాలంలో వైద్యులే ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు. కరోనా వైరస్ బారినపడినవారికి తమ ప్రాణాలు అడ్డుపెట్టి వైద్యం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు వైద్యులు కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది వైద్యులు తీవ్ర అనారోగ్యంపాలవుతున్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో కరోనా రోగులు మృతి చెందుతున్నారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో ఓ వైద్యుడు చేసిన ట్వీట్ ఇపుడు నెట్టింట వైరల్ అయింది. పైగా, అంత్యంత శీతలీకరణ వాతావరణంలో పీపీపీ కిట్ ధరించడం వల్ల ఆయన చేతులు ముడతలు పడి పిండేసినట్టుగా మారిపోయాయి. ఈ ఫోటోను కూడా ఆయన షేర్ చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు అయ్యో... పాపం అంటూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం చేస్తున్నారు. ఈ పోరాటంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది అలుపెరుగకుండా సేవలు చేస్తున్నారు. ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా చూసేందుకు.. ఇన్ఫెక్షన్‌కి గురైన వారి ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలు లెక్కచేయకుండా ముందుండి వైద్యం చేస్తున్నారు.
కొన్ని నెలలుగా గంటల తరబడి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు ధరించాల్సి రావడం వల్ల వారి శరీరంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజాగా ట్విటర్లో ఓ వైద్యుడు తన ప్రత్యక్ష అనుభవాన్ని ఫోటోతో సహా షేర్ చేసుకున్నారు. తేమ వాతావరణంలో ఎక్కువసేపు పీపీఈ ధరించడం వల్ల ఆయన చేతులు ముడతలు పడి పిండేసినట్టుగా తయారైన వైనాన్ని పోస్టుచేశారు.
'అత్యంత తేమ వాతావరణంలో ఎక్కువగా చెమటలు పట్టిన కారణంగా పీపీఈ తీయగానే నా చేతులు ఇలా కనిపించాయి' అని డాక్టర్ సయద్ ఫైజన్ అహ్మద్ పేర్కొన్నారు. కొవిడ్-19, కొవిడ్ వారియర్స్, డాక్టర్ తదితర హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఆయన తన పోస్టుకు జతచేశారు.
దీంతో నెటిజన్ల నుంచి డాక్టర్లకు థ్యాంక్స్ చెబుతూ పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. డాక్టర్ పెట్టిన ఈ పోస్టుకు 24 గంటల్లోనే 24 వేల మంది లైక్ చేశారు. 4 వేల మంది రీట్విట్లు, కామెంట్లు పెట్టారు.