దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. గత ఆరు నెలల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 3824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
దాదాపు 184 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళ రాష్ట్రంలో రెండు మృతి కేసులు నమోదయ్యాయి. ఈ మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,30,389కి చేరింది. అలాగే, దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 18,389కి చేరింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.87 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,47,22,605 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 4,41,73,335 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.