టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా 87,000 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. పూర్తిగా టీకా తీసుకున్నవారిలో అత్యధికంగా కేరళలో 46 శాతం మంది కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. కేరళలో టీకా తొలి డోసు తీసుకున్న వారిలో 80,000 కరోనా కేసులు నమోదు కాగా, రెండో డోసు తీసుకున్న వారిలో 40,000 మందికి వైరస్ సోకినట్లు అధికారులు చెప్పారు.
వంద శాతం వ్యాక్సిన్ రేటు నమోదు చేసిన కేరళలోని వయనాడ్‌లో కూడా కరోనా కేసులు నమోదైనట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కేరళతోపాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
మరోవైపు భారత్‌లో మరో మూడు వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. అందులో ఒకటి స్పుత్నిక్ వీ లైట్. రష్యాకు చెందిన గమలేరియా సంస్థ ఈ టీకాను తయారు చేసింది. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇండియాకు చెందిన పనాసియా బయోటెక్ సంస్థ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం తరువాత పనాసియా సంస్థ భారత్‌లో అత్యవసర అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకుంది. ఈ వ్యాక్సిన్ డేటాను భారత్ డ్రగ్ కంట్రోల్ త్వరలోనే పరిశీలించే అవకాశం ఉన్నది. సెప్టెంబర్ నాటికి స్పుత్నిక్ వీ లైట్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.
ఇప్పటికే ఇండియాలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. స్పుత్నిక్ వీ రెండు డోసుల వ్యాక్సిన్ కాగా, స్పుత్నిక్ వీ లైట్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. పరాగ్వేలో స్పుత్నిక్ వీ లైట్ 93.5 శాతం సామర్ధ్యాన్ని కనబరిచిందని ఆర్‌డిఐఎఫ్ పేర్కొంది. అయితే, రష్యాలో మే నెలలో ఈ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చారు. అప్పట్లో అక్కడ ఈ వ్యాక్సిన్ 79.4 శాతం సామర్థ్యాన్ని కనబరిచిందని ఆర్‌డీఐఎఫ్ హెడ్ కిరిల్ పేర్కొన్నారు.