కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఫస్ట్ వేవ్ కంటే కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. వైరస్ వ్యాప్తి కూడా అత్యంత వేగంగా జరుగుతోంది. మొదటి దశలో వృద్ధులకే ఎక్కువ ప్రమాదమా ఉంటే .. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్‌తో ఎక్కువ ప్రమాదం యువతకే ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరిస్తోంది.
ఈ సారి వృద్ధుల కంటే కూడా యువతనే ఎక్కువగా కొవిడ్-19 బారిన పడుతున్నారని ఐఎంఏ అధ్యక్షులు జయపాల్ వెల్లడించారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొదటి దశతో పోలిస్తే సెకండ్ వేవ్‌లో కరోనా మరణాలు తగ్గాయని ఐఎంఏ అధ్యక్షులు వెల్లడించారు. అయితే కరోనా బారిన పడే వారి సంఖ్య మాత్రం పెరిగిందని తెలిపారు.
మూడో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు నిండిన వారికి కరోనా టీకా అందిస్తున్నారు. కరోనా మరణాలను అరికట్టాలనే ఉద్దేశంతో వయసు రీత్యా ఎవరికి అవసరమో వారికి టీకాలను అందిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఐఎంఏ అధ్యక్షులు జయపాల్ తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా సెకండ్ వేవ్‌లో యువతీయువకులే ఎక్కువ కరోనా బారిన పడుతున్నారని కాబట్టి కేంద్ర ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.