'కిల్లర్ కరోనా' దెబ్బకు ప్రపంచం హడల్ ... 170 కోట్ల మంది క్వారంటైన్

మంగళవారం, 24 మార్చి 2020 (07:57 IST)
కిల్లర్ కరోనా దెబ్బకు ప్రపంచం స్తంభించిపోయింది. ఈ మహమ్మారి వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ నడుంబిగించాయి. ఇందులోభాగంగా అగ్రరాజ్యాలన్నీ లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో 170 కోట్ల మందికిపైగా ప్రజలు క్వారంటైన్లలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 
 
ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా తాజాగా మరో 50 దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఆ జాబితాలో ఫ్రాన్స్‌, ఇటలీ, అర్జెంటీనా, అమెరికా, ఇరాక్‌, రువాండా, గ్రీస్‌ చేరాయి. బుర్కినా ఫాసో, చిలీ, ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా, సెర్బియా, మౌరిటాని యా దేశాలు కర్ఫ్యూ విధించగా, సోమవారం సాయంత్రం నుంచి సౌదీ అరేబియా ఆ జాబితాలో చేరింది. 
 
ఇరాన్‌, జర్మనీ, బ్రిటన్‌లు తమ ప్రజలను గృహాల్లోనే ఉండాలని ప్రజలను కోరాయి. 10 దేశాలు కర్ఫ్యూతోపాటు రాత్రివేళ ప్రయాణాలపై నిషేధం విధించాయి. 174 దేశాల్లో సోమవారం నాటికి 15,873 మంది మృతి చెందారు. 3,50,142 మందికి వైరస్‌ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. 50కి పైగా దేశాలు 170 కోట్ల మంది ప్రజలను ఇండ్లకే పరిమితం కావాలని కోరాయి. తాజాగా మరణాల్లో చైనా కంటే ఇటలీ ముందువుంది. 
 
ఆ దేశంలో సోమవారం నాటికి 6,077 మంది మృత్యువాత పడగా, 63,927 మందికి సోకింది. చైనాలో స్థానికంగా కేసులు నమోదు కావడం నిలిచిపోయింది. కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారిలో 39 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలగా, తొమ్మిది మంది మరణించారు. దీంతో చైనాలో మృతుల సంఖ్య 3,270కు చేరగా, 81,093 మందికి వైరస్‌ సోకింది. 
 
స్పెయిన్‌లో 2,207 మంది, ఇరాన్‌లో 1,812, ఫ్రాన్స్‌లో 674, అమెరికాలో 501 మంది మరణించారు. అమెరికా సెనెటర్‌ రాండ్‌ పాల్‌కు కరోనా వైరస్‌ సోకింది. సెనెట్‌లో వైరస్‌ బారిన పడిన వారిలో ఆయన తొలి సెనెటర్‌ కావడం గమనార్హం. చెక్‌ రిపబ్లిక్‌, నైజీరియా, మాంటెనెగ్రోలలో ఆదివారం తొలి మరణాలు నమోదయ్యా యి. 
 
పాపువా న్యూగునియా, సిరియాల్లో తొలి కేసులు రికార్డయ్యాయి. పశ్చిమాసియాలో 1841 మృతులు నమోదు కాగా, 26,688 మందికి వైరస్‌ సోకింది. ఆఫ్రికాలో 49 మంది మృతి చెందగా, 1,479 కేసులు నమోదయ్యాయి. అలాగే, భారత్‌లో కొత్త కేసులతో కలుపుకుని ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 500కు చేరుగా, ఇందులో పది మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నిలిచింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వణికిస్తున్న కరోనా మహమ్మారి.. 30 రాష్ట్రాలు లాక్‌డౌన్...