Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ద్వారా వైరస్ సోకుతుందా? డబ్ల్యూహెచ్ఓ తాజా గైడ్‌లైన్స్

Advertiesment
Coronavirus
, శుక్రవారం, 4 డిశెంబరు 2020 (07:10 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే చర్యల్లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాకుండా, సెంట్రల్ ఎయిర్‌ కండీషనింగ్, ఎయిర్ కండీషన్డ్ ప్రదేశాలలో గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుందా లేదా అనే సందేహంపై కూడా క్లారిటీ ఇచ్చింది. 
 
కొవిడ్‌-19 ను నివారించడానికి ఫేస్ మాస్క్‌ల వాడకానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి నుంచి  బయటపడేందుకు రోగనిరోధక శక్తిని పెంచడం, నిర్ణీత దూరం పాటించడం ఉత్తమ ఆయుధాలుగా పేర్కొంది. 
 
ప్రపంచ జనాభాకు ఇంకా సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ అందుబాటులో లేనప్పుడు, నిర్దిష్ట చికిత్సలు లేకపోవడంతో వైరస్ నుంచి నివారణకు గతంలో మాదిరిగా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించడమే ఒక్కటే చక్కటి మార్గమని తెలిపింది. 
 
వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి కొన్ని ప్రభావవంతమైన మార్గాలుగా నిర్ణీత దూరం పాటించడం, చేతులు శుభ్రపర్చుకోవడం, సరైన శ్వాసకోశ పరిశుభ్రత, ఫేస్ మాస్క్‌లు లేదా ఫేస్ కవర్లు ధరించాలని డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసింది.
 
సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందన్న రిపోర్ట్‌లు గతంలో వచ్చాయి. పేలవమైన వెంటిలేషన్, కార్లు లేదా చిన్న గదులు వంటి ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలలో వైరస్ గాలి గుండా ప్రయాణించి ఆరోగ్యకరమైన వ్యక్తులలో సంక్రమణకు కారణమవుతుంది. 
 
అందువల్ల, ఇంట్లో ఉన్నప్పుడు, బహిరంగ స్థలాల్లో ఉన్న సందర్భాల్లో కూడా మాస్క్‌ ధరించడం శ్రేయస్కరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నది. వైరల్ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి నాణ్యమైన మాస్క్‌లను ఉపయోగించడం చాలా మంచిదని డబ్ల్యూహెచ్‌ఓ చెప్తున్నది. 
 
వ్యాయామశాలలో ఫేస్ మాస్క్ ధరించాల్సిన అవసరం లేనప్పటికీ సరైన వెంటిలేషన్, నిర్ణీత దూరాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమని ఆరోగ్య సంస్థ పునరుద్ఘాటించింది. ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని, తప్పనిసరిగా విందులు, కార్యక్రమాల్లో హాజరుకావాల్సి వచ్చినప్పుడు బృంద సభ్యులు దూరంగా ఉంటూ మాస్క్‌లు ధరించాలి. 
 
అదేవిధంగా, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం, శానిటైజర్లు వాడటం, కార్యాలయాల నుంచి ఇంటికి  వెళ్లగానే స్నానం చేయడం వంటివి చేయడం ద్వారా కొవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చునని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానంటున్న అమెరికా అధ్యక్షుడు!