Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన 17 మందికి కరోనావైరస్

Advertiesment
హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన 17 మందికి కరోనావైరస్
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (14:27 IST)
హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన 17 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని అధికారులు ధ్రువీకరించారు. వారిలో పది నెలల శిశువు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
 
హైదరాబాద్‌లోని తలాబ్‌కట్టకు చెందిన ఒక మహిళ ఏప్రిల్ 10న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఆమెకు కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైరస్ పరీక్షలు నిర్వహించారు.
 
ఏప్రిల్ 13న ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. దాంతో, వైద్య అధికారులు అప్రమత్తమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారికి కలిపి మొత్తం 41 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 17 మందికి కోవిడ్ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయిందని అధికారులు తెలిపారు. వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 24 మందిని కూడా ప్రభుత్వ నిజామియా హాస్పిటల్‌లో క్వారెంటైన్‌కు తరలించారు.
 
మరణించిన మహిళా వయసు దాదాపు 60 ఏళ్ళు. గుండెకు సంబధించిన సమస్యతో ఆమెను ఏప్రిల్ 9న నాంపల్లి లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. గాంధీ ఆస్పత్రి ప్రస్తుతం కరోనావైరస్ చికిత్సకు కేంద్రంగా మారడంతో, అక్కడి నుంచి ఆ మహిళను కింగ్ కోఠి హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు దాదాపు నాలుగు గంటల పాటు చికిత్స అందించారు. 
 
పరిస్థితి క్రిటికల్‌గా మారటంతో, అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్‌కు పంపారు.
 ఉస్మానియాలో కూడా కొన్ని గంటల సేపు చికిత్స చేశారు. అయితే, ఆ సమయంలో అక్కడ వెంటిలేటర్ అందుబాటులో లేనందున ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళాలని డాక్టర్లు ఆ కుటుంబానికి సూచించారని అధికారులు తెలిపారు. దాంతో, అక్కడి నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు ఆమెను తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు కరోనావైరస్ పరీక్షలు నిర్వహించారు. 
 
ఇంతలోనే ఆ మహిళ మరణించారు. మరుసటి రోజు టెస్ట్ ఫలితాలు వచ్చాయి. ఆమెకు కోవిడ్ సోకిందని వైద్యులు ధ్రువీకరించడంతో అధికారులు మిగతా కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా, ఆమెకు చివరగా చికిత్స అందించిన ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వాటి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
 
అయితే, ఆ మహిళకు వైరస్ ఎలా సోకిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో ఒకే కుటుంబంలో ఇంత మందికి వైరస్ సోకడం ఇదే మొదటిసారి. వీరిలో ఒక 10 నెలల శిశువు నుంచి 12 ఏళ్ళ లోపు పిల్లలు ఆరుగురు ఉన్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ రేటుతో విడుదలైన #Oppo Ace 2: ఫీచర్స్ ఇవే