ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా మంగళవారం కూడా కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,114 శాంపిళ్లను పరీక్షించగా మరో 704 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
వారిలో 648 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది. 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 12,202 అని పేర్కొంది.
ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 14,595 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 6,770 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,245 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 187కి చేరింది.
జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే, అనంతపురం 1571, చిత్తూరు 1054, ఈస్ట్ గోదావరి 1129, గుంటూరు 1349, కడప 940, కృష్ణ 1467, కర్నూలు 1955, నెల్లూరు 608, ప్రకాశం 370, శ్రీకాకుళం 63, విశాఖపట్టణం 542, విజయనగరం 159, వెస్ట్ గోదావరి 995 చొప్పున కేసులు నమోదైవున్నాయి.