కరోనా థర్డ్ వేవ్ అని చాలా మంది వణికిపోతున్నారు. కానీ, అంత తీవ్రత ఉండదు... అంత భయం లేదంటున్నారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. వివిధ దేశాల్లో కరోనా ప్రభావాన్ని బట్టిచూస్తే మన దగ్గరా మూడో దశ (థర్డ్ వేవ్) ఉండే అవకాశం ఉందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
సెప్టెంబరులో అది వచ్చే అవకాశం ఉందన్నారు. వైరస్‌లో తీవ్రమైన ఉత్పరివర్తనాలు జరిగితే తప్ప, ఇక్కడ దాని ప్రభావం తక్కువేనన్నారు. థర్డ్‌వేవ్ పిల్లలపై తీవ్రత చూపుతుందనేదీ సరికాదన్నారు. తొలి రెండు దశల్లోనూ పిల్లలపై ఇన్‌పెక్షన్ ప్రభావం చూపిందన్నారు. ఇప్పటికే చాలా మంది పిల్లల్లో ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) వృద్ధి చెందాయన్నారు. వేగవంతమైన టీకాల పంపిణీతో పాటు కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా థర్డ్‌వేవ్‌ను అడ్డుకోవచ్చని సూచించారు.
కరోనా రెండో విడతలో కేసుల తీవ్రతకు డెల్టా వైరస్ కారణమన్నారు. చైనా వైరస్ ఒకరి నుంచి ఇద్దరికి వ్యాపిస్తే, అదే బ్రిటిష్ వైరస్ ముగ్గురికి, ఆల్ఫా నలుగురైదుగురికి, డెల్టా వైరస్ ఒకరి నుంచి ఏకంగా 5-8 మందికి సోకిందన్నారు.
ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చినా, మిగతా వారంతా కొవిడ్ బారిన పడటానికి ఇదే కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం డెల్టా ప్లస్ కేసులు దేశవ్యాప్తంగా 100 లోపే నమోదయ్యాయన్నారు. తెలంగాణలో ఇంతవరకు ఒక్క కేసూ వెలుగుచూడలేదని డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఏడాది తర్వాత కరోనా సాధారణ జలుబు, దగ్గు, జ్వరంలా మారిపోతుందని ఆయన వివరించారు.