ఆసియా దిగ్గజ బయోపార్మాస్యూటికల్ కంపెనీగా ఉన్న బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందర్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోమవారం రాత్రి వెల్లడించారు.
'కరోనా కేసుల్లో నేను కూడా చేరాను. కానీ నాకు లక్షణాలు తక్కువగానే ఉన్నాయి... త్వరలోనే కరోనా నన్ను వదిలేస్తుందనే ఆశతో ఉన్నాను' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మజుందార్ షాకు కరోనా అని తెలిసి చాలా మంది ఆమె త్వరగా కోలుకోవాలని ట్విట్ చేశారు. వీరిలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ఉన్నారు. ‘ఇలాంటి వార్త విన్నందుకు చాలా బాధగా ఉంది. మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ శశి థరూర్ ట్విట్ చేశారు.
కాగా, కిరణ్ మజుందార్ షాకు చెందిన బెంగళూరు బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్, కోవిడ్-19 చికిత్స కోసం సోరియాసిస్‌కు వాడే ఇటోలిజుమాబ్ అనే ఔషధాన్ని తిరిగి తయారు చేయడానికి కృషి చేస్తోంది.
గత నెలలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అత్యవసర పరిస్థితుల్లో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడానికిగాను చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేయడానికి ఉపయోగించే ఇటోలిజుమాబ్‌కు అనుమతి ఇచ్చింది.
అయితే దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం నాలుగు కోవిడ్ కేంద్రాలలో.. 30 మంది రోగులపై మాత్రమే క్లినికల్ ట్రయల్స్ జరిపి.. దాని ఆధారంగా కోవిడ్-19 చికిత్సకు ఇటోలిజుమాబ్‌కు అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.