Publish Date: Sun, 25 May 2025 (16:30 IST)
Updated Date: Sun, 25 May 2025 (16:33 IST)
దేశంలో తొలి కరోనా మరణం నమోదైంది. బెంగుళూరు నగరంలో చాలాకాలం తర్వాత ఈ మృతి కేసు నమోదు కావడం గమనార్హం. శనివారం 85 యేళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 108 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఐదుగురికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం కర్నాటకలో మొత్తం 38 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 32 మంది బెంగుళూరు నగరంలోనే చికిత్స పొందుతున్నారు.
దీనిపై కర్నాటక ఆరోగ్య శాఖామంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది చాలా సాధారణ పరిస్థితి. గత 15 రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది అని ఆయన శనివారం బెంగుళూరులో మీడియాకు తెలిపారు.
"కరోనా వైరస్ ఇపుడు మన వ్యవస్థలో ఒక భాగంగా మారిందని, ఇతర వైరస్‌ల మాదిరిగానే దీన్ని పరిగణించాలని" మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. తీవ్రమైన లక్షణాలు కనిపించనంత వరకు భయపడాల్సిన పనిలేదని, ప్రజలు సాధారణ జీవనం కొనసాగించవచ్చని ఆయన పేర్కొన్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటివి కరోనాతో పాటు ఇతర వ్యాధులు నివారణకు కూడా ఉపయోగడతాయని వివరించారు.