ఆస్ట్రాజెనెకా కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డుకడుతున్నట్టు పలువురు చెబుతున్నారు. దీంతో ఆ వ్యాక్సిన్‌పై పలు అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా, ఈ టీకాలు వేయించుకున్న పలువురు తమలో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైనట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.
దీంతో ఈ వ్యాక్సిన్ వినియోగాన్ని ఆరు దేశాలు నిలిపివేశాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొందరు తమ శరీరంలో రక్తం గడ్డకట్టిన ఆనవాళ్లు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టినట్టు నివేదికలు వచ్చినట్టు డానిష్ హెల్త్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతో, ఈ వ్యాక్సిన్ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, వ్యాక్సిన్ వల్లే రక్తం గడ్డ కట్టిందని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇదే కారణంగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని ఆపేస్తున్నట్టు సోమవారం నాడు ఆస్ట్రియా ప్రకటించింది.
లిథువేనియా, లక్సెంబర్గ్, లాత్వియా, ఎస్టోనియా దేశాలు కూడా తదుపరి బ్యాచ్ వ్యాక్సిన్ల వాడకాన్ని ఆపేశాయి. ఈరోజు నుంచి వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపి వేస్తున్నట్టు డెన్మార్క్ ప్రకటించింది.
ఈ నెల 9వ తేదీ నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షల మందికి పైగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు వేశారు. వీరిలో 22 రక్తం గడ్డం కట్టిన కేసులు వచ్చాయి. దీంతో, ఈ వ్యాక్సిన్ పై జనాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.