ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ తలమునకలైవున్నాయి. ఇందుకోసం సరైనా టీకాను కనిపెట్టే ప్రయత్నంలో అన్ని దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. అలాంటి దేశాల్లో భారత్ కూడా వుంది. అయితే, ప్రస్తుతం భారత్‌లో నాలుగు వ్యాక్సిన్లు పరిశోధన దశలో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయనీ, ప్రస్తుతానికి 100 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. వాటిలో భారత్‌కు చెందిన 14 కరోనా వ్యాక్సిన్లు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. వాటిలో 4 వ్యాక్సిన్లు మరింత మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్టు చెప్పారు.
త్వరలోనే వాటిని క్లినికల్ ట్రయల్స్ దశకు తీసుకెళుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆ వ్యాక్సిన్లను వివిధ వయసులున్న మనుషులపై ప్రయోగిస్తారని, ఆపై వచ్చే ఫలితాల ఆధారంగా వాటి పురోగతి ఆధారపడి ఉంటుందని వివరించారు. రాబోయే ఐదు నెలల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని వివరించారు.
ఏదేమైనా కరోనా వ్యాక్సిన్ వచ్చేసరికి సుదీర్ఘ సమయం పడుతుందని హర్షవర్ధన్ తెలిపారు. ఓ వ్యాక్సిన్ అన్నివిధాలా సిద్ధం కావడానికి కనీసం ఏడాది సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు. అప్పటికీ వ్యాక్సిన్ రాని నేపథ్యంలో... భౌతికదూరం, శానిటైజర్లు, ఫేస్ మాస్కులతో కరోనా వైరస్ బారినపడుకుండా ఉండటం మినహా మరో మార్గం లేదని మంత్రి వర్షవర్థన్ తెలిపారు.