ఊరిమిరప రుచి కోసం..
ఊరిమిరపకాయలు కారం లేకుండా ఉండాలంటే వాటిని కోసేటప్పుడు కత్తికి కాస్త ఉప్పు రాసి దానితో పచ్చిమిర్చిని కోయాలి. అలాగే కాసిని మెంతులు, మినపప్పులను నూరి మజ్జిగలో ఉప్పు వేసి పచ్చిమిర్చిని ఊరబెట్టండి. రుచిగా ఉంటాయి.
పులుసులో ఉప్పు ఎక్కువైనప్పుడు..
మీరు రుచికరంగా చేయాలనుకున్న పులుసులో ఉప్పు ఎక్కువైందా? అలాంటప్పుడు ఏం చేయాలంటే చపాతీ పిండిని ఏడు లేదా ఎనిమిది ఉండలుగా చేసి దానిని పులుసులో వేసి కాసేపాగి తీసేయండి. పులుసు చాలా రుచిగా ఉంటుంది.
కూరలు మిగిలిపోతే..
వండిన కూరలు, పచ్చివి ఏవైనా మిగిలిపోయాయని పారేయకండి వాటిని కలిపి చింతపులుసు పోసి ఉప్పు, పసుపు, కారాలను వేసి పులుసులా పెట్టండి, కొత్త రకం పులుసు రెడీ అయిపోతుంది.
సాంబార్ రుచి కోసం..
సాంబార్ చేసేందుకు కందిపప్పును ఉడికిస్తున్నారా అయితే ఉడికించే సమయంలో ఇందులో కాసిన్ని మెంతులను కూడా వేయండి రాత్రి వరకు పాడవకుండా ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.