యావత్ ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ వేడుకలలో మునిగి తేలుతున్న తరుణంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆధ్వర్యంలో ఒరిస్సాకు చెందిన 187 మంది క్రైస్తవులు మంగళవారం హిందూ మతాన్ని స్వీకరించారు. 187 మందిలో 103 మంది పురుషులు కాగా మిగిలినవారు మహిళలు.
రూర్కెలాకు 45 కి.మీ.ల దూరంలో సుందర్గర్హా జిల్లాలోని చికిటా గ్రామంలో గల నువాగోవ్ బ్లాక్లో వీహెచ్పీ నిర్వహించిన ధార్మిక కార్మిక కార్యక్రమంలో క్రైస్తవులు , హిందువులుగా మారిన వైనం చోటు చేసుకుంది. మతమార్పిడి కార్యక్రమానికి 'బారాబర్టన్' (స్వగృహాగమనం)గా నామకరణం చేశారు.
హిందువులైన క్రైస్తవులకు ఈ సందర్భంగా హిందూ దేవతా మూర్తులను కలిగిన లాకెట్లను నిర్వాహకులు అందించారు. వీహెచ్పీ రూర్కెలా విభాగపు అధ్యక్షుడు మిత్రభాను పాండా, వీహెచ్పీ ధర్మప్రచారక్ విభాగం రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి మకర్ధ్వజ్ మహతో మరియు రాష్ట్ర ధర్మప్రచారక్ కార్యదర్శి గధాధర్ సాహు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.