నిస్సహాయులను బలపరిచే ఏసుక్రీస్తు
సర్వం కోల్పోయిన వారిని, నిస్సహాయులను బలపరుస్తాడు ఆ ఏసు క్రీస్తు. సర్వం కోల్పోయిన వ్యక్తి అలోచనా విధానం ఎలా ఉంటుంది? తాను బ్రతికి ఉండటం వృధా అనుకుంటాడు. ఆ బాధనుండి విముక్తి అయ్యేందుకు తనకుతానే మరణశాసనాన్ని రాసుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ వీటన్నింటినుండి తప్పించే దేవుడు ఉన్నాడని గ్రహించలేరు. ఒక నిస్సహాయ స్థితి దేవుడి వైపుకు తిప్పగలదు. ఆయనపై ఆధారపడేలా చేస్తుంది. దేవుడి శక్తి ఏమిటో ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అర్థం అవుతుంది. అందుకేనేమో తనకుతానుగా ఎలాంటి విమోచనా పొందలేని వ్యక్తి దయనీయ స్థితిని చూసిన దేవుడు తన ఒక్కడైన క్రీస్తును పంపేందుకు వెనుకంజ వేయలేదు. తన స్వరూపంలో ఉన్న మానవుడిని ఉన్నత స్థితిలో ఉంచేందుకు క్రీస్తు హీనస్థితిని అనుభవించాడు. తన ముఖంపై ఉమ్మివేసేవారిని ఆయన ఉరిమి చూడలేదు. చెంపపై కొట్టేవారిని ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించలేదు. ఆలాంటి వారిని మరింతగా ప్రేమించాడు. తన రాజ్యంలో చేర్చుకునేందుకు ఇష్టపడ్డాడు.