మానవ సేవయే మాధవ సేవ, పాటించు వారు దైవప్రసన్నత చేరువ కాగలరు.
చార్లెస్ స్పర్జన్ 19వ శతాబ్దపు ప్రసిద్ది దైవసేవకుడు. లండన్‌లో ఆయన ఇంట్లో చాలా కోళ్లుండేవి. అవి చాలా గుడ్లు పెట్టేవి. కాని స్పర్జన్ దంపతులు వాటిని ఎవరికీ ఉచితంగా ఇచ్చేవారుకాదు! ఎంత దగ్గరి బంధువులకైనా వాటిని ఉచ్చితంగా ఇచ్చేవారు కాదు. ఆ కారణంగా ఆయనకు పిసినిగొట్టు అన్న పేర వచ్చింది. అలా కోళ్లు, గుడ్లు అమ్మగా వచ్చిన డబ్బుతో వారు ఒక పేద విధవరాలి కుటుంబాన్ని పోషించారు ఆ రహస్యం భార్యాభర్తలిద్దరూ చనిపోయాక అందరికీ తెలిసింది. కుడిచేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదన్న యేసు ప్రభువు ఆజ్ఞను వారు ఆవిధంగా పాటించారు (మత్త 6:3).దేవునికి సహాయం చేయలనుకుంటున్నాం, ఎలా ఇవ్వాలి? చర్చిలకా? అనాథాశ్రమాలకా? సువార్తా సంస్థలకా? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నే యేసు ప్రభువుకు వేస్తే పేదలకు ఇవ్వమనే చెబుతాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నిరుపేదల పక్షపాతి. ఆరోజుల్లో గొప్పవాడైన ధనవంతుడొకాయన, తనకు నిత్య జీవాన్ని ప్రసాదించమని ప్రభువుని కోరాడు. 'నీకొకటి తక్కువగా ఉంది, వెళ్లి నీ ఆస్తినంతా బీదలకు పంచు' అని ప్రభువు ఆదేశిస్తే చిన్నబుచ్చుకుని నిష్క్రమించాడు (మార్కు 10:21).దేవుని గుండె చప్పుడు నిరుపేదల జీవితాల్లో స్పష్టంగా వినిపిస్తుంది. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులువైన మార్గం నిరుపేదలను ఆదుకోవడమేనని చాలామందికి తెలియదు. అందుకే, ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే, దాహం గొన్నవారికి నీళ్లిస్తే, నిరాశ్రయులకు నీడకల్పిస్తే, రోగులు, ఖైదీలను పరామర్శిస్తే తనకు పరిచర్య చేసినట్టేనని ప్రభువు సుస్పష్టంగా బోధించాడు (మత్త 25:35-40). అయినా నిరుపేదల జీవితాల్లో యేసు ప్రభువును చూసే సువిశాలత విశ్వాసుల దృక్పథంలో కరవవుతోంది. అందుకే ఒకవైపు పేదరికం పెచ్చరిల్లుతుంటే, మరోవైపు ప్రార్థనామందిరాలు, ధార్మిక సంస్థలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. అంతరిక్షాన్ని జయించగలిగిన ఆధునిక మానవుడు ఆకలి కేకల్ని రూపుమాపలేక పోవడం అత్యంత అవమానకరం.ఆకలికి, ఆక్రందనలకు, పేదరికానికి కులమతాలు లేవు. వాటిని రూపుమాపడం అందరి భాధ్యత. విశ్వాసులకు దేవుడిచ్చిన ఆధిక్యత. తనను ఆశ్రయించిన ఏ ఒక్కరినీ ప్రభువు 'మీరు నన్ను విశ్వసించేవారా, కాదా?' అని ఎన్నడూ ప్రశ్నించలేదు. అయితే ఆయన పరిచర్యలో తాదాత్మ్యం చెందిన వారు తమకు తెలియకుండానే ఆయనకు అనుచరులయ్యారు.ధరలు ఆకాశానికి అంటుతూ మనం గౌరవంగా బతకడమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో మన పాలవాడు, పనిమనిషి, మనపిల్లల్ని స్కూల్లో దింపేఆటోడ్రైవర్, అటెండర్, కూరగాయలమ్మే వ్యక్తి, బట్టలుతికే వ్యక్తి వారి పిల్లల స్కూలు ఫీజులు కట్టేందుకు ఎంత అవస్థపడుతున్నారో ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా? వారిలో ఎవరైనా ఆస్పత్రి పాలైతే ఆ ఖర్చు భరించడం వారికెంత నరకమో ఆలోచించారా? మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఈ ఆత్మీయులున్న సమీపపరిధిని దాటి వెళ్లి, మన దాతృత్వం చర్చిలను, ప్రబోధకులకు కోటీశ్వరులను చేయాలని ప్రభువు ముమ్మాటికీ ఆశించడు. వారి అవసరాన్ని కొంతైనా తీర్చి వారి మొహాన చిరునవ్వు తేగలిగినప్పుడు మీ చిరుసాయానికి నెయ్యి ప్రసంగాలకున్న శక్తి ఉంటుంది.