Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రిస్మస్.. కరుణామయుడు క్రీస్తు జన్మదినం

క్రిస్మస్.. కరుణామయుడు క్రీస్తు జన్మదినం
, సోమవారం, 24 డిశెంబరు 2012 (21:14 IST)
PTI
"క్రిస్మస్" క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. యేసు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారస మూర్తిగా, దయామూర్తిగా నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు భక్త జనులు.

ఆ కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు.

అప్పుడు ' నజరేతు ' అనే పట్టణంలో మేరీ, జోసఫ్ అనే వాళ్ళు నివసిస్తున్నారు. మేరీకి జోసెఫ్‌తో పెళ్ళికుదిరింది. ఇదిలా ఉండగా ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కనబడి 'ఓ మేరీ! నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతివి అవుతావు. నీవు ఒక కుమారుని కంటావు. అతనికి 'యేసు' అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు' అని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మేరీ గర్భవతి అయింది.

ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెండ్లాడరాదని, విడిచి పెట్టాలని ఆలోచించసాగాడు. అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి' మేరీని నీవు విడనాడవద్దు. ఆమె భగవంతుని వరం వలన గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తన్ను నమ్మిన ప్రజలందరిని వాళ్ళ పాపాల నుండి రక్షిస్తాడు.' అని చెప్పాడు. జోసఫ్ న్యాయవంతుడు భక్తుడు. కనుక మేరీని ప్రేమతో ఆదరించాడు.

జోసఫ్ స్వగ్రామం బెత్లేహం. అందుచేత వాళ్ళు రాజాజ్ఞను అనుసరించి బెత్లేహేముకు బయలుదేరారు. తీరా వాళ్ళు బెత్లేహేము చేరుకునే సరికి వాళ్ళకక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మేరీ ఒక శిశువును ప్రసవించింది.

ఆ రాత్రి ఆ ఊరికి ప్రక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెలకాపరులు భయపడ్డారు. దేవదూత వాళ్ళతో, భయపడకండి. ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త. ఇవ్వాళ బెత్లెహేములోని ఒక పశువులపాకలో, లోక రక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి, పశువుల తొట్టిలో పండుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. అతడే లోకరక్షకుడు అని చెప్పాడు.

దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా ఆకాశం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవునికి స్తుతి గీతాలు పాడి మాయమైనారు. గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువును, మేరీ, జోసెఫ్ లను చూశారు. వారు తాము చూచింది, దేవదూత తమకు చెప్పింది అందరికి తెలియజేశారు. అలా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబరు 24వ తేదీ అర్థరాత్రి యేసు క్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబరు 25వ తేదీ క్రిస్మస్ పండుగ.

Share this Story:

Follow Webdunia telugu