అతిథి సేవకు అన్ని మతాలు ప్రాధాన్యత నిస్తున్నాయి. ఇంటి మెట్టెక్కిన అతిథికి సపరిచర్యలు చేసి గౌరవిస్తే పుణ్యఫలం లభిస్తుందని అనేక పురాణాలు చెబుతున్నాయి. ఇదే తరహాలో క్రైస్తవులు ఇంటికొచ్చిన అతిథులకు పాదాలు కడిగి పాదసేవ చేయాలని ఆ మత గ్రంథాలు ఉద్భోదిస్తున్నాయి.
పాపులను రక్షించుటకై తననుతాను అర్పించుకొన్న పరమాత్ముడు ఏసుక్రీస్తు. ఇతరుల వద్ద ఎల్లప్పుడు ప్రేమ భావముతో మెలగాలంటూ ఉద్భోధించారు. బాప్టిస్టులైన ప్రతి ఒక్కరూ ఇతరుల పాదములు కడుగుట వలన క్రీస్తుతో పాలుపంచుకునే అవకాశమును పొందుతారని క్రైస్తవ గ్రంథాలు చెబుతున్నాయి.
ఈ కార్యము ద్వారా ప్రేమ, పవిత్రత, వినయము, క్షమ, సేవ వంటి ఉత్తమగుణాలు అలవరచుకుంటారని ఆ గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. బాప్టిసం తీసుకొన్న ప్రతివ్యక్తీ ఏసుక్రీస్తు నామమున అతిథుల పాదాలు కడగాలి. ఈ కార్యము ద్వారా పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం.