హోం వర్కులలో పెద్దవాళ్ల జోక్యం ఎంతవరకుండాలి?
* చదువుల్లో, స్కూల్లో పిల్లల పురోగతి ఎలా ఉందో పెద్దవాళ్లు తెలుసుకునేందుకు హోం వర్కులు ఉపకరిస్తాయి. పెద్దలు హోం వర్కులలో ఎక్కువగా జోక్యం చేసుకోవటం, ఈ విషయంలో అనుక్షణం ప్రశ్నిస్తుండటంవల్ల పిల్లలు ఇంట్లోని వారికోసం అన్నట్లు పుస్తకాల ముందు చేరుతారేగానీ, పూర్తిస్థాయి ఏకాగ్రత చూపించలేరు. కాబట్టి వారంతట వారే ఆసక్తిగా హోం వర్కులు చేసేలా పూర్తి స్థాయి అవకాశాలను పెద్దలు కల్పించాలి.* ఏదో ఒకటి చేశాం అన్నట్లుగా కాకుండా అసైన్మెంట్స్ను అభ్యాస ప్రక్రియతో కలిపి పూర్తి చేయటం అవసరం. ఇందుకు అవసరమైన సాయం చేయటం, తెలియనివి వివరించటం చేయాలే తప్ప ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకోకూడదు. ప్రతిరోజూ ఓ వేళ ప్రకారం హోంవర్కులకు కూర్చోబెట్టాల్సిన బాధ్యత పెద్దలదే. పిల్లలు హోంవర్కులకు కూర్చొనే సమయంలోనే ఇంట్లోని మిగతావారు టీవీల ముందు కూర్చోవటం, ఫోన్లలో బాతాఖానీలు చేయటం, కబుర్లు చెప్పటం లాంటివి చేయకూడదు.* పిల్లలు చదువుకునేందుకు, హోంవర్కులను పూర్తి చేసుకునేందుకు వీలుగా అనువైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియనవి చేయించటం, పూర్తి చేసిన వాటికి ప్రశంసించటం లాంటి వాటికే పెద్దలు పరిమితం కావాలి. అంతేగానీ ప్రతిదాంట్లోనూ సలహాలు ఇస్తుంటే పిల్లల్లో స్వయం అభ్యాస లక్షణం తగ్గిపోయి ప్రతిదానికీ ఆధారపడే తత్వం పెరిగిపోతుంది. అది సరైన పద్ధతి కాదు.