వేసవిలో ఎక్కువగా పిల్లల్ని బాధించే "డయేరియా"
* చిన్న పిల్లల్లో సాధారణంగా వేసవి కాలంలో వచ్చే వ్యాధులలో "డయేరియా" (నీళ్ల విరేచనాలు) ఒకటి. డయేరియా ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం జరిగే అవకాశాలున్నాయి. అందుకే డయేరియాను నివారించేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లల్ని ఈ సమస్య నుంచి సునాయాసంగా బయట పడవేయవచ్చు.* డయేరియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ఎక్కువగా విరేచనాలు కావటంతో, వారి శరీరంలోని నీరు, లవణాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. దీంతో వారి శరీరం డీ హైడ్రేషన్‌కు గురై, ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి పిల్లలు కోల్పోయిన నీటిని, లవణాలకు వెంటనే వారి శరీరానికి అందించినట్లయితే డయేరియాను ఆపవచ్చు.* పిల్లలు విరేచనాలతో కోల్పోయిన నీటిని, లవణాలను తిరిగీ శరీరానికి అందించాలంటే.. పాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటి పదార్థాలను క్రమం తప్పకుండా అందించాలి. విరేచనాలు ఎక్కువగా అవుతున్నాయని పిల్లలకు ఆహారం ఇవ్వకుండా మానివేయకూడదు. ఇలా చేస్తే పిల్లలు నీరసించిపోతారు.* పిల్లలకు విరేచనాలు ఎక్కువగా అవుతున్న సమయంలో ఓఆర్ఎస్ ద్రవాన్ని తప్పకుండా త్రాగించాలి. ఈ ద్రవాన్ని విరేచనం అయిన ప్రతిసారీ పిల్లలకు తాగిస్తూ ఉంటే సమస్య రెండు లేదా మూడు రోజులలో అదుపులోకి వస్తుంది. అలాగే కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, తగినంత పంచదార వేసి బాగా కలిపి పిల్లలకు ఇస్తుండాలి. ఇలా ఇవ్వటంవల్ల విరేచనాలతో బాధపడినా పిల్లలు బలహీనం అవకుండా ఉంటారు.