రాత్రంతా నిద్ర మేలుకుని మరీ చదవటం అవసరమా..?
* రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు రాత్రంతా మేలుకుని లైన్ టు లైన్ రివిజన్ చేయకూడదు. అయితే ముఖ్యమైన పాయింట్స్‌ను ఒకసారి మననం చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్స్ సమయంలో రాత్రంతా మేలుకుని చదివితేనే మార్కులు బాగా వస్తాయని అనుకోవటం సరికాదు. రాత్రి చదవకపోయినా బాగానే రాయగలమని విశ్వాసం పెంచుకోవాలి.* ఏదైనా చాప్టర్ చదవటం పూర్తి కాకపోయినా.. జనరల్ నాలెడ్జ్ ఉపయోగించి సమాచారాన్ని సంక్షిప్తంగానైనా రాయగలను అనే ధైర్యాన్ని పెంచుకోవాలి. ఒక సమాధానాన్ని పదిసార్లు రివైండ్ చేస్తేనే గుర్తుంటుందని అనుకోకూడదు. రెండుసార్లు చదివినా మైండ్‌లో స్థిరపడేవిధంగా చదివితే సరిపోతుంది.* రాత్రి పది-పదకొండు గంటలు దాటకముందే పడుకోవాలి. ఉదయం ఒక గంటసేపు మాత్రం ముఖ్యమైన పాయింట్లను చదువుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా పిల్లలు నిద్రను ఎంతగా ఆపుకుంటే, పరీక్షల సమయంలో భయం అంతగా రెట్టింపు చేస్తుందని గుర్తుంచుకోవాలి. అంతేగాకుండా రాత్రిళ్లు ఎక్కువ సమయం మేల్కొని చదివితే, అది గుర్తుండకపోగా, అంతకు ముందు చదివిన చాఫ్టర్స్‌ని కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. నిద్రపోకుండా రాత్రంతా చదువుతూ ఉంటే మానసిక, శారీరక ఆరోగ్యాలపై చెడు ప్రభావం చూపిస్తుంది.