మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి తెస్తే...?!
* పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటూ పెద్దలు పిల్లలపై ఒత్తిడి పెంచినట్లయితే అది చిన్నారుల మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్ని మంచి ర్యాంకువైపు నడిపించాలేగానీ, మెరుగైన ఫలితాల కోసం వారిని ప్రమాదంలోకి నెట్టేయకూడదని వారు సూచిస్తున్నారు.* విద్యార్థులు గత పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధిస్తే.. ఇప్పుడు జరిగే పరీక్షల్లో లక్ష్యాన్ని 80 మార్కులుగా పెడితే సరిపోతుంది. కానీ 90 నుంచి ఆపైకి మార్కులు సాధించాలని ఒత్తిడి చేయడం తగదు. పిల్లలు గత పరీక్షల్లో 80 శాతం మార్కులు సాధించి ప్రస్తుతం 70 శాతానికి పడిపోతే అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. పెరిగిన సిలబస్, పాఠశాల సెలవులు, టీచర్ల బోధనా లోపాలు, మారిన స్నేహితులు, ఇంట్లో వాతావరణం.. ఇలా అనేక అవరోధాలు ఉండొచ్చు.* పరీక్షల సమయంలో విద్యార్థులు సొంతంగా టైం టేబుల్ వేసుకునే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. వారి ఇష్టప్రకారం ఆటలకు సమయాన్ని కేటాయించాలి. పిల్లలు చదువుకునే సమయంలో తల్లిదండ్రులు టీవీ చూడటం, ఇతర పనులు చేస్తూ పిల్లల ఏకాగ్రతను దెబ్బతీయవద్దు. తల్లిదండ్రులు పార్టీలు, ఫంక్షన్లకు వెళ్తుంటే పిల్లల ఏకాగ్రతపై ఆ ప్రభావం పడుతుంది.