మాటలు నేర్చుకునే చిన్నారులకు పేరెంట్సే బోధకులు..!!
* చిన్నపిల్లలు మాటలు నేర్చుకునేటప్పుడు తల్లిదండ్రులు వారి బోధకులుగా అవతారం ఎత్తాల్సిందే. ఆ వయస్సులో పిల్లలు పెద్దలను బాగా అనుకరిస్తుంటారు. అందుచేత వారిని దగ్గర కూర్చోబెట్టుకుని అంకెలు, వారాలు, బుల్లి బుల్లి నీతిబోధ కథలు బోధించాలి. తెలుగు పద్యాలు నేర్పాలి. నిదానంగా విధులు, నక్షత్రాలు, రుతువులు గురించి తెలియచెప్పాలి. * ఇంటికి వచ్చిన అతిథులను ఎలా పలకరించాలో చెప్పాలి. సంప్రదాయ పద్ధతులు నేర్పాలి. ఆ పద్ధతులే పిల్లల జీవితంలో ఓ పునాదిరాళ్లలా మారతాయన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలి. పిల్లల్ని పాఠశాలకు పంపించటం మొదలెట్టాక వారి దగ్గర కూర్చొని పాఠాలు చదివించడం, రాయించడం చేయించాలి. తెలియని విషయాలను విడమర్చి, విపులీకరించాలి.* ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులే మంచి సలహాదారులగా సలహాలివ్వాలి. ఏది మంచిపని, ఏది మంచిది కాదు, ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే బావుంటుంది, ఎలా చేస్తే నలుగురూ వారిని మెచ్చుకుంటారు, దేనివల్ల వారికి ప్రయోజనం కలుగుతుంది... తదితర విషయాలను పిల్లలకు తెలియజెప్పాల్సింది తల్లిదండ్రులే.* పిల్లల ప్రవర్తనను విమర్శించి మంచిదార్లో పెట్టా ల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. పిల్లలు మంచేదో, చెడేదో తెలుసుకోలేరు కాబట్టి, తెలిసీ తెలియక చెడు వైపు ఆకర్షితులు కావచ్చు. అలాంటప్పుడు వారి తప్పును సున్నితంగా ఎత్తి చూపి, దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో వివరించాలి. మంచిచెడులు, వాటి తేడాలు పిల్లలకు అర్థమైనప్పుడే వారు మంచిదారిలో పయనిస్తారు.