ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిలో పిల్లల్ని ఎలా చూసుకోవాలో ఒక్కసారి చూద్దాం. పసిపిల్లలను, ఎదుగుతున్న శిశువులను ఈ ఎండ ప్రభావం పడకుండా చూసుకోండి. ఉదయం ఎనిమిది గంటలలోపే ఆవ నూనె కానీ, నువ్వుల నూనెతోగానీ పిల్లల శరీరమంతా పైపైన రాసి మూడు చెంచాల పెసర పిండిలో ఒక చెంచా గంధపు పొడి, అర చెంచా పసుపు కలిపి నీళ్లతో ముద్దగా చేసి ఒంటికి నలుగు పెట్టి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించండి. చెమటను పీల్చే పల్చని బట్టలు వేయండి
ఒక గ్లాసు మంచి నీళ్లలో తొమ్మిది ఎండు ద్రాక్ష, రెండు ఎండు ఖర్జూరాలు నానబెట్టి నాలుగు గంటల తర్వాత పిండి, పిప్పిని తీసివేసి, అందులో అర చెంచా తేనె కలిపి పసిపిల్లలకు రెండు చెంచాల చొప్పున ఆరారగా ఇవ్వండి. ఇది ఎండ ప్రభావాన్ని నిరోధించి పిల్లలకు శక్తినిస్తుంది.
రకరకాల పౌడర్లు వాడకుండా రోజుకు నాలుగుసార్లు గంధపు పొడి, వట్టివేరు చూర్ణం, కొంచెం పచ్చ కర్పూరం కలిపి శిశువుల శరీరానికి రాయండి. చర్మం చక్కగా ఉంటుంది.
ఎదుగుతున్న స్కూలు వయస్సు పిల్లలని పగలు పదకొండు గంటల తర్వాత నుంచి సాయంత్రం నాలుగ్గంటల వరకూ ఇంట్లోనే ఆడుకొమ్మని చెప్పండి. ఆ సమయంలో పళ్లరసం, ఐస్ లేకుండా చెరకు రసం, దానిమ్మ రసం, ద్రాక్ష రసం ఇవ్వండి. మధ్యాహ్నం చిలికిన వెన్నతో ఉన్న మజ్జిగలో చిటికెడంత ఉప్పు, పంచదార కలిపి రెండు కరివేపాకు రెక్కలు వేసి పిల్లలకు ఇవ్వండి.
మీ పిల్లలు ఈ వేసవిలో శరీరశక్తి, మేధోశక్తి పెంచే చక్కటి టిఫిన్ ఇవ్వండి. అదేవిధంగా ఎదుగుతున్న మీ టీనేజ్ ఆడపిల్లలకు పాతబెల్లం, నువ్వులు కలిపి చేసిన నువ్వుల ఉండలను కనీసం రోజుకు రెండు ఇవ్వండి. వాటివల్ల వాళ్లలో హార్మోన్లు నిశ్చలంగా ఉంటాయి.