ప్రతిదాన్ని చదువుతో ముడిపెట్టడం సబబేనా..?
* పిల్లలు ఏది అడిగినా వారి చదువుతో ముడిపెట్టడం చాలా ఇళ్లల్లో కనిపిస్తుంటుంది. ఇలాంటి వైఖరి వాంఛనీయం కాదు. సినిమా, షికారు, ఆటలు, బొమ్మలు, దుస్తులు.. ఇలా ఏవి అడిగినా దాన్ని వారి చదువుల్లోని ప్రతిభతో మెలికవేస్తూ పెద్దలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు.* పిల్లలు బాగా చదవాలని, వారు రాణించాలని కోరుకోవటంలో తప్పులేదు. కానీ, అనుక్షణం చదువుతో ముడిపెట్టడం మాత్రం సరికాదు. దీనివల్ల ఒక్కోసారి పిల్లలకి చదువుమీద అసలు ఆసక్తి తగ్గిపోయే అవకాశం కూడా లేకపోలేదు. జీవితంలో చదువు అత్యంత ముఖ్యం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే పిల్లలకు మిగతా అంశాలపట్ల ఆసక్తి ఉండకూడదు అనుకోవటం మాత్రం సరైంది కాదు.* మంచి మార్కులు వస్తేనో లేదా క్లాసులో ఫస్టుగా ఉంటూ ఎప్పుడూ మొదటి ర్యాంకును సాధిస్తేనే ఏమైనా కొనిస్తానంటూ పెద్దలు పిల్లలకు చెప్పటం మంచిది కాదు. ఒకదానితో ఒకటి ముడిపెట్టకుండా పిల్లలకు ప్రాధాన్యతా క్రమాలను అర్థమయ్యేటట్లు వివరిస్తూ, వారికి ఇష్టమైన అంశాలలో కూడా ఆసక్తి చూపేలా చేయటంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర.