ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కనీయండిలా..!!
* ఎప్పుడూ టీవీలకు, కంప్యూటర్లకు, ఇంటికే పరిమితం అయ్యే చిన్నారుల్ని హాయిగా ప్రకృతి ఒడిలో ఆడుకునేలా చేస్తే శారీరకంగానూ, ఆరోగ్యపరంగానూ భేషుగ్గా ఉంటారని పిల్లల నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఆడుకునే ఆటల్లో చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కోవటం, వాళ్లంతట వారుగా వాటిని పరిష్కరించటం లాంటివి చేస్తే.. వారు పెద్దయ్యాక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను కూడా స్వయంగా పరిష్కరించుకునే నైపుణ్యం సాధిస్తారని వారంటున్నారు.* పిల్లలు ఆయా వయస్సుల్లో ఆటలు ఆడుతూ, చిన్న చిన్న సాహసాలు చేస్తేనే.. పెద్దయ్యాక ఎదురయ్యే అనేకమైన సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే ధైర్యం వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా పిల్లలు చదువుతున్నప్పుడు.. నువ్వు చదువు, చదువుతున్నంతసేపు నేను నీ ప్రక్కనే కూర్చుంటాను అంటూ.. వాళ్ళచేత అదేపనిగా చదివిందే చదివించడం, రాసిందే రాయించడం లాంటివి కూడా వారి మనస్సులపై ప్రభావం చూపిస్తాయని వారు చెబుతున్నారు.* చదువులు, ఆటపాటల్లో పిల్లలు ముందుండాలన్న ఆలోచనతో పిల్లల ఆసక్తిని పట్టించుకోకుండా వేసవిలోనూ లేనిపోని శిక్షణలిప్పించడం లాంటివి చేస్తే వారి అందమైన బాల్యాన్ని చిదిమేసినట్లే. పిల్లల కోరికలను, ఆశలను గుర్తించి.. తల్లిదండ్రులు వారిని స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలనీ, పిల్లల్లో ఆశాభావ దృక్పథాన్ని పెంపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.