పెద్దలు చిరాకు, కోపాలను పిల్లలపై ప్రదర్శిస్తే...?
* కొంతమంది తల్లిదండ్రులు వారి పని ఒత్తిడి తాలూకు చిరాకు, కోపాలను పిల్లలపై ప్రదర్శిస్తుంటారు. అది పిల్లల్లో అభద్రతాభావాన్ని కలిగిస్తుందని వారు గుర్తించలేరు. దాంతో పిల్లలు పెద్దలకు ఏం చెప్పాలన్నా సంశయిస్తారు. పిల్లల్లో ఇలాంటి అభిప్రాయం ఏర్పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ముందుగా కోపాన్ని నియంత్రించుకోవాలి.* పిల్లలు తమ మనసులోని భావాలను బయటికి చెప్పాలని అనుకుంటారు. అందుకు తల్లిదండ్రులనే శ్రోతలుగా ఎంచుకుంటారు. ఈ విషయాన్ని గమనించి, వారు చెప్పేవి సహనంగా వింటూ, అవసరమైన సలహాలను ఇస్తుంటే పిల్లలకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అది వారిలో చెప్పలేనంత భరోసాను ఇస్తుంది.* ఎన్ని చిరాకులున్నా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించటం తల్లిదండ్రుల బాధ్యత. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు పిల్లలు తప్పటడుగులు వేయటం సహజం. అందుకే వారి స్నేహితుల గురించి, పాకెట్ మనీనీ ఎలా వాడుకుంటున్నారు తదితర విషయాలను ఎప్పటికప్పుడు పెద్దలు అడిగి తెలుసుకోవాలి. అలాగని అతిగా ఆంక్షలు విధిస్తే అసలుకే మోసం వస్తుంది కాబట్టి.. సున్నితంగా వ్యవహరిస్తూనే, పిల్లలకు క్రమశిక్షణను అలవాటు చేయాలి.