పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించాలంటే..?!
* ముందుగా చిన్నారులకు ఊబకాయం అంటే ఏంటో స్పష్టంగా తెలియజెప్పాలి. దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, స్థూలకాయంవల్ల అకాల మరణానికి గురవవచ్చునని వారికి స్పష్టంగా అర్థం చేయించాలి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా చేరుతుందనీ, గుండెజబ్బులు, మధుమేహం, పిత్తాశయంలో రాళ్లు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుందని వారికి ఓపికగా తెలియజెప్పాలి.* అయితే జబ్బుల గురించి చెప్పటమేగాకుండా.. వాటి బారిన పడకుండా ఉండాలంటే ఊబకాయం రాకూడదని, ఒకవేళ ఉన్నట్లయితే తగ్గించుకునే ప్రయత్నం చేయాలని పిల్లలకు చెప్పాలి. ఇందుకోసం పిల్లల జీవనశైలిని మార్చుకునేలా పెద్దలు ప్రోత్సహించాలి. అంతేగాకుండా శారీరకంగా, ఉత్సాహంగా ఉండేలా పిల్లల్ని తీర్చి దిద్దటమేగాకుండా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను వారిలో పెంపొంచేందుకు కృషి చేయాలి.* టీవీల ముందు గంటల తరబడి కూర్చోనివ్వకూడదు. ఎందుకంటే ఈ అలవాటు వల్లనే పిల్లల్లో ఊబకాయం సమస్య ఎక్కువగా వస్తుంది కాబట్టి, దీన్ని కూడా వారికి అర్థం చేయించాలి. అదే విధంగా టీవీలలో వచ్చే చిరుతిళ్ల వ్యాపార ప్రకటనలవైపు కూడా వారు ఆకర్షితులు కాకుండా చేయాలి. టీవీలకు బదులుగా పెరట్లోనో, ఇంటి ముందరో ఆటలు ఆడుకునేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇలా చేస్తే వారి శరీరానికి తగినంత వ్యాయామం అందుతుంది. తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండటమేగాకుండా, వారిలో ఊబకాయం రాకుండా కాపాడుకోవచ్చు.