పిల్లల్ని దారికి తేవాలంటే, చాక్లెట్లు ఇవ్వాల్సిందేనా..?
* పిల్లలు అలిగినప్పుడో, ఏడుస్తున్నప్పుడో, కోపంగా ఉన్నప్పుడో వారిని మచ్చిక చేసుకునేందుకు చాక్లెట్లు ఇవ్వటం అందరికీ అలవాటే. అయితే పిల్లలకు ఇలా ప్రతిసారీ చాక్లెట్లను ఇవ్వటం అలవాటుగా చేసినట్లయితే వారిలో మొండి పెరిగిపోవటమేగాక, చిన్నతనంలోనే దంత సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశాలను పెంచినట్లవుతుందన్న సంగతిని పెద్దలు గుర్తించాలి.* ఎన్ని చాక్లెట్లను పిల్లలు తింటున్నారు అనేదానికంటే, ఎన్నిసార్లు తింటున్నారనే అంశానికి, వారి దంతాల ఆరోగ్యానికి సంబంధం ఉందని వైద్యులు చెబుతున్నారు. చాక్లెట్లను ఎక్కువమోతాదులో పదే పదే తింటున్నట్లయితే పిల్లలు చిన్నతనంలోనే దంతక్షయం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారంటున్నారు.* అలాగే తీపి పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బంగాళాదుంప చిప్స్ లాంటి వాటిని భోజన సమయంలో పిల్లలకు ఇవ్వటంవల్ల కూడా దంత సంబంధ వ్యాధులు, జబ్బుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అదే పనిగా పెద్దలు పిల్లలకు చాక్లెట్లు ఇవ్వవద్దనీ, అలాగే పిల్లలు నిద్రపోయేందుకు ముందు కూడా ఎలాంటి తీపి పదార్థాలను ఇవ్వకూడదని వైద్యులు సూచిస్తున్నారు.