పిల్లల్ని తప్పనిసరిగా వీటికి దూరంగా ఉంచండి..
* పిల్లలు విషపూరిత పదార్థాల బారిన పడకుండా ఉండాలన్నా.. అలాగే రక్తగాయాలు, కాలిన గాయాలతో బాధపడకుండా ఉండాలన్నా.. ఇంట్లో ఉండే పలు రకాల కత్తులు, చాకులు, ప్లాస్టిక్ బ్యాగులు, క్లీనింగ్ ఉత్పత్తుల్లాంటి ప్రమాదకర వస్తువులను పిల్లలకు అందకుండా జాగ్రత్తపడాలి.* అలాగే చిన్నారులు జబ్బు చేసినప్పుడో లేదా ఏవైనా గాయాలు తగిలినప్పుడు ఎవరికివారుగా ఓ నిర్ణయానికి వచ్చేసి.. చేతికి అందిన మందులనో, యాంటిబయాటిక్స్‌నో వాడేయటం మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమయాల్లో వైద్యుడిని సంప్రదించి, ఆయన సూచించిన మందులనే పిల్లలకు వినియోగించటం ఉత్తమం. తద్వారా పిల్లల ఆరోగ్యానికి ఢోకా ఉండదు.* అలాగే మరీ చిన్నగా ఉన్న పిల్లలను కుర్చీలు, సోఫాలు, డైనింగ్ టేబుళ్లపైన కూర్చోబెట్టి ఎటూ వెళ్లకూడదు. అలా వెళ్లినట్లయితే ఓ చోట కుదురుగా ఉండలేని పిల్లలు అటూ ఇటూ కదులుతూ కిందపడి గాయాలపాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలను అపరిశుభ్రమైన ఆహారం నుంచి దూరంగా ఉంచాలి. ఏవేవో ముట్టుకున్న చేతులతో అలాగే ఆహారాన్ని తయారుచేసి పిల్లలకు పెట్టకూడదు. పిల్లలకోసం వాడే పాత్రలన్నీ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.