పిల్లలన్నాక "అల్లరి" సహజమే, అందుకే కట్టడి వద్దు..
* ఐదారేళ్ల పిల్లలకు అల్లరి చేయటం మహా సరదా. వారి అల్లరితో ఇల్లంతా గందరగోళం సృష్టించేస్తుంటారు. ఆ వయసు పిల్లలకు ప్రతిదీ కొత్తగా కనిపిస్తుంటుంది. అందుకే అంతగా అల్లరి చేస్తుంటారు. అల్లరి, పరుగులు పెట్టడం, కేకలు వేయటం, వస్తువులను విరగ్గొట్టడం, వాటిని మళ్లీ బాగు చేయటం.. లాంటివన్నీ చిన్నారుల వికాస ప్రక్రియలో భాగాలేనని అర్థం చేసుకుని వారిని కట్టడి చేయకుండా ఉండాలి.* పిల్లల శక్తిని సరైన దిశలోకి మళ్లించేలా బొమ్మలు ఇవ్వాలి. డ్యాన్స్, స్విమ్మింగ్ లాంటి శిక్షణా తరగతులకు వారి ఆసక్తిని బట్టి పంపించాలి. అయితే ఏ వయసులో పొందే ఆనందాన్ని, ఆ వయసులో పొందగలిగే అవకాశాన్ని తల్లిదండ్రులుగా పిల్లలకు ఇవ్వటం మాత్రం మర్చిపోకూడదు.* ఇంకాస్త ఎదిగిన పిల్లలకు మంచి మార్కులు వస్తేనేగానీ జీవితంలో ముందుకెళ్లలేము అనే భావన కలిగేలా పెద్దలు ప్రవర్తించకూడదు. అలాగే బలవంతంగా పెద్దల ఆశయాలను, కోరికలను పిల్లలపై రుద్దకూడదు. పిల్లల శ్రమను పొగిడి, వారి మనోబలాన్ని రెట్టింపు చేయాలేగానీ నిరుత్సాహ పర్చకూడదు.