పిల్లలకు "ఫాస్ట్‌ఫుడ్" కంటే "పండ్లే" బెస్ట్..!!
* ఇళ్లలో ఉండే చిన్నారులు, అటు హాస్టళ్లలో ఉండే పిల్లలు ప్రతిరోజూ ఒకే రకమైన ఆహార పదార్థాలను తినీ తినీ విసుగు చెందుతుంటారు. అలాంటప్పుడు వారు సులభంగా ఫాస్ట్‌ఫుడ్‌లంటే మక్కువ చూపిస్తుంటారు. అయితే ఇలాంటి ఆహారానికి అలవాటుపడే చిన్నారులు తరువాత అనేకరకాల ఆరోగ్య సమస్యలబారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.* బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఎక్కువ లభించే చిప్స్, సమోసాలు, పేస్ట్రీలు.. లాంటి పదార్థాలకు చిన్నారులు అలవాటు పడటంవల్ల వారి జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తాయని పిల్లల నిపుణులు చెబుతున్నారు. డీప్ ఫ్రై చేసే పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయనీ, వాటి శాతం శరీరంలో మించితే భవిష్యత్తులో గుండెపోటు బారిన పడే ప్రమాదం పొంచి ఉంటుందని వారంటున్నారు.* ఫాస్ట్‌ఫుడ్ కంటే పిల్లలకు తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్ లాంటివి ఎక్కువ ఇవ్వటం అలవాటు చేయాలని నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే ఈ పదార్థాలు చక్కటి పోషక విలువలను కలిగి ఉంటాయనీ, అందుకనే ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆయా సీజన్లలో పిల్లలకు క్రమం తప్పకుండా ఇస్తే మంచిదని వారు సూచిస్తున్నారు. ఇలా చేసినట్లయితే పిల్లల ఆరోగ్యాలను పది కాలాలపాటు చల్లగా కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.