పిల్లలకు ఈ వస్తువులను దూరంగా ఉంచుతున్నారా..?
* ముఖ్యమైన మందులు.. ఇల్లు క్లీనింగ్ కోసం వాడే రకరకాల వస్తువులు, పదార్థాలను చిన్నారులకు అందకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. అంతేగాకుండా, క్లీనింగ్ కోసం వాడే కంటైనర్లు, డబ్బాలు, బాటిల్స్ లాంటి వాటికి మర్చిపోకుండా మూతలను బిగించి పిల్లలకు దూరంగా ఉంచాలి.* చిన్న పిల్లలను బాత్‌టబ్‌కు దగ్గర్లోగానీ, నీరు నిల్వచేసే మరే ఇతర ప్రాంతాలలోగానీ తల్లిదండ్రులు ఒంటరిగా వదలిపెట్టి పోకూడదు. పొరపాటున వదిలిపెట్టారంటే, పిల్లలు నీళ్లతో ఆడుకుంటూ.. మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని నీటికి దగ్గర్లో ఒంటరిగా వదలకూడదు.* చిన్నారులకు వేడినీళ్లతో స్నానం చేయించేటప్పుడు.. ముందుగా వేడినీళ్ల ఉష్ణోగ్రతను పరీక్షించి, పిల్లలు తట్టుకోగలిగేంత వేడి ఉందని నిర్ధారించుకున్న తరువాతే వారికి స్నానం చేయించటం మంచిది. ఇలా చేసినట్లయితే చిన్నారులకు సహజంగా ఉండే సున్నితమైన చర్మాన్ని కాలిన గాయాల బారి నుండి రక్షించినట్లవుతుంది.