చిన్నారుల ముందు పోట్లాటలు, గొడవలు వద్దు..
* చిన్నారుల ముందు పెద్దలు పోట్లాటలు, గొడవలు పడకూడదు. అలా చేస్తే వారి సున్నితమైన మనసులను గాయపర్చడమేగాకుండా.. పెద్దయ్యాక వారు కూడా అలాగే తయారయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులను అనుకరించే చిన్నారులు, తల్లిదండ్రులు సులభంగా అబద్ధాలు చెప్పినట్లయితే.. వారు ఎదిగేకొద్దీ అదే పద్ధతికి అలవాటవుతారు. కాబట్టి పిల్లలముందు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. ఒకవేళ పిల్లలు అబద్ధాలు చెబితే ప్రోత్సహించకూడదు.* చిన్నప్పటినుంచీ పిల్లల్ని అది చేయ్, ఇది చేయ్ అంటూ ఆదేశాలు జారీ చేయటం కూడా మంచిది కాదు. అలా మాట్లాడకు, ఇలా చేయకు, అలా చేయి, అటు పోవద్దు, ఇటు రావద్దు, వానలో తడవద్దు, చాక్లెట్లు తినకూడదంటూ పిల్లలపై సవాలక్ష ఆంక్షలు పెట్టేయటం కూడా తగదు. ఇలా చేయటంవల్ల వారిలో సహజసిద్ధంగా ఉండాల్సిన లక్షణాలు కనుమరుగై.. తల్లిదండ్రులు ఎలా చెబితే అలా నడుచుకునే మరబొమ్మల్లా తయారవుతారు. ఇది పిల్లలకు ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు.* పిల్లలు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినట్లయితే కోప్పడకుండా ఓపికగా వివరించి చెప్పాలేగానీ.. కసురుకోవటం, కోప్పడం లాంటివి పెద్దలు చేయకపోవటం మంచిది. పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులుగానూ, వాళ్లు పెద్దయ్యాక స్నేహితులుగానూ మెలగటం అవసరం.