చిన్నప్పటినుంచే పొదుపు చేయటం నేర్పించాలి..
* చిన్నతనం నుంచే పిల్లలకు పొదుపు చేయటం నేర్పించటం చాలా అవసరం. డబ్బు విలువ చిన్నతనం నుంచే వారికి తెలియటంవల్ల ఆదా చేసే తత్వం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అలవాటవుతుంది. అయితే మరీ చిన్నవయసులో కాకుండా ఐదేళ్ల పిల్లలకు ఆకర్షణీయంగా ఉండే కిడ్డీ బ్యాంకులను బహుమతిగా ఇచ్చి పొదుపును ప్రోత్సహించాలి.* పిల్లలకు చాక్లెట్లు, చిరుతిళ్ల కోసం ఇచ్చిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని మాత్రమే ఖర్చుపెట్టి, మిగిలినదాన్ని కిడ్డీ బ్యాంకులలో దాచుకోవటం నేర్పించాలి. వివిధ నాణాలను, వాటి మధ్య ఉండే తేడాలను కూడా అర్థమయ్యేటట్లు పిల్లలకు చెప్పాలి. 5నుంచి 10 సంవత్సరాలలోపు పిల్లలకు చిన్న మొత్తంలో పాకెట్ మనీని ఇవ్వాలి.* పాకెట్ మనీలోంచి కూడా కొంత మిగుల్చుకునేలా వారికి అలవాటు చేయాలి. అలా వారు దాచుకున్న డబ్బును పిల్లలకు కావలసిన వస్తువులను కొనుకునే అవకాశం కల్పించాలి. దీంతో డబ్బు దాచుకోవటంవల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయో వారికి అనుభవపూర్వకంగా అర్థం అవుతుంది.* ఖర్చులను, ఆదాలను రెండింటినీ ఎప్పటికప్పుడు ఒక నోట్‌బుక్‌లో రాయమని పిల్లలకు చెప్పాలి. అదే విధంగా వాళ్లు పెట్టే ఖర్చులు, ఆదా చేసే డబ్బుకంటే తక్కువగా ఉండాలని అర్థం చేయించాలి.