చిన్నతనం నుంచే పిల్లల్లో పొదుపును ప్రోత్సహించాలి..
* పిల్లలకు చిన్నతనం నుండే డబ్బు విలువను తెలియజెప్పి, పొదుపు చేసేలా పెద్దలు ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే వారికి పొదుపు గురించి తెలియడం వల్ల డబ్బును ఆదా చేసే తత్త్వం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పిల్లలకు అలవాటవుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో డబ్బును చిన్నతనం నుంచే ఆదా చేసే అలవాటును నేర్పించటం వల్ల వారికి డబ్బును ఎలా వృద్ధి చేయవచ్చో తెలిసి వస్తుంది.* అయితే మరీ చిన్న వయస్సు నుండీ కాకుండా... 5 సంవత్సరాల వయసులోపు పిల్లలకు ఆకర్షణీయమైన కిడ్డీ బ్యాంకులను గిఫ్ట్‌లుగా ఇచ్చి అందులో డబ్బు దాచుకోవడం అలవాటు చేయాలి. వారికి చాక్లెట్లకు, చిరుతిండ్లకు ఇస్తున్న డబ్బుల్లో కొన్ని నాణాలను ఖర్చుపెట్టి, మరికొన్ని నాణాలను అందులో వేసి ఆదా చేసేలా ప్రోత్సహించాలి. అంతేగాకుండా, నాణాల మధ్య తేడాను, వాటి విలువలను కూడా అర్థమయ్యేటట్లు వివరించాలి.* ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల వయస్సు గల పిల్లలకు చిన్న చిన్న మొత్తాలలో పాకెట్ మనీ ఇవ్వండి. అందులోంచి వారు దాచుకున్న డబ్బుతోనే వారికి నచ్చిన బొమ్మను కొనుక్కోనివ్వాలి. ఇలా చేయడం వల్ల డబ్బు దాచుకోవడం వల్ల ఉపయోగాలు అర్థమవుతాయి.