ఎదిగే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి?
, సోమవారం, 9 ఏప్రియల్ 2012 (18:06 IST)
అమ్మపాల నుంచి... అన్నప్రాశనలోకి అడుగుపెట్టాక ఎదిగే పాపాయికి ఏం పెట్టాలి? బిడ్డ చలాకీగా, చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఉండటానికి ఏ పోషకాలు అందించాలి? ఈ సందేహాలు తరచూ తల్లులని తికమకపెడతాయి.. ముఖ్యంగా ఏడాదిలోపు బిడ్డ ఎదుగుదలకి అవసరం అయిన పోషకాలని ఎలా సులువుగా అందించాలో చెబుతున్నారు నిపుణులు.అమ్మపాలు :తొలినాళ్లలో అంటే ఆరునెలల వరకు బిడ్డకు కావాల్సిన సమస్త పోషకాలు అమ్మపాల నుంచే అందుతాయి. తల్లి అందించే ఆ పాలే బిడ్డ వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల భారిన పడకుండా చేస్తాయి. ఇక ఆర్నెల్ల తర్వాత నుంచీ.. ఎదిగే చిన్నారులకు వారి అవసరాలరీత్యా ఘనాహారాన్ని తప్పనిసరిగ్గా అందించాలి. ఆరోగ్యవంతమైన శిశువు పుట్టినప్పుడు సుమారు మూడు కేజీల వరకు బరువుండాలి. ఐదో నెలకి అది రెట్టింపవ్వాలి.తొలి ఘనాహారం :* సాధారణంగా అన్నప్రాశన జరిగినప్పటి నుంచి మెత్తగా మెదిపిన అన్నం, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, అరటిపండు గుజ్జు, నెయ్యి వంటి వాటిని పిల్లలకు తినిపించాలి. ఇంకా తొలి ఘనాహారంలో గింజ ధాన్యాలు, పాలు, పప్పు దినుసుల కలయికతో చేస్తే మంచిది. ఎందుకంటే ఇవి త్వరగా జీర్ణమవుతాయి.* శుభ్రం చేసిన కిలో పెసలని పదిహేను గంటల పాటు నానబెట్టి వాటిని తడి వస్త్రంలో మూటకట్టి రోజంతా ఉంచితే మొలకలొస్తాయి. తర్వాత వీటిని బాగా ఎండబెట్టి పొట్టు, మొలకలు తొలగించిన తర్వాత దోరగా వేయించి, చల్లార్చి పిండి పట్టించుకొని పిల్లలకు ప్రతిరోజూ తినిపించాలి.* అదేవిధంగా శుభ్రం చేసిన కేజీ రాగులని పదిహేను గంటల పాటు నానబెట్టుకోవాలి. నీటిని వంపి తడి వస్త్రంలో మూడు రోజుల పాటు మూటకట్టి ఉంచాలి. మధ్యలో నీటిని చిలకరిస్తూ, మొలకలు వచ్చిన తర్వాత తీసి ఎండబెట్టాలి. తర్వాత వాటిని దోరగా వేయించుకోవాలి. మొలకలని తొలగించే పిండి పట్టించుకొని గాలిచొరని డబ్బాలో భద్రపరచుకొని ప్రతిరోజు తినిపించాలి.* ఏడు, ఎనిమిది నెలల్లో ఈ పిండితో పాటు ఆహారానికి తోడుగా బాగా ఉడికించిన మాంసం, పప్పు, చేపలు, కూర ముక్కలు, పండ్లు, గుడ్డులోని పచ్చసొన, అవసరాన్ని బట్టి కొద్దిగా పంచదార కలపొచ్చు. అధిక శక్తికోసం ఆహారంలో కొద్దిగా నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలని కలపడం వల్ల రెట్టింపు శక్తి అందుతుంది.* పసిపాపల ఆహారంలో గట్టిగా ఉండే పదార్థాలని, పొట్టు ఉన్నవాటిని దూరంగా ఉంచాలి. లేకపోతే అజీర్తి చేస్తుంది.* ఏడాది నిండిన పిల్లలకు క్రమంగా అన్ని రకాల ఆహారాలని పరిచయం చెయ్యాలి.