ఎగ్జామ్స్ టైమ్‌లోనే పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుందా..?
* పరీక్షల సమయంలో పిల్లల్లో ఒత్తిడి పెరగటం సహజం. అది కూడా సంవత్సరాంతపు పరీక్షల సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒత్తిడి ఎక్కువయ్యేకొద్దీ వారు రోజువారీ పనులను మరచిపోవటం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరం, నిస్సత్తువ లాంటి వాటికి గురవుతారు. చదివినది గుర్తుండక పోవటం, నిరాశ, ఏమీ చేయలేకపోవటం, ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ లాంటివాటితో సతమతం అవుతారు. * పిల్లలకు పరీక్షల సమయంలో ఒత్తిడి ఎందుకు పెరుగుతుందంటే.. పరీక్షలకు సిద్ధం కాకపోవటం, సరిగా చదవకపోవటం, ప్రశ్నాపత్రంపై ఆందోళన, చదివిన పాఠాల్లోంచే ప్రశ్నలు వస్తాయో, లేదోనన్న సందేహం, వచ్చినా ఆ సమయంలో జవాబు గుర్తుంటుందో లేదోనన్న భయం లాంటివన్నీ పిల్లల ఒత్తిడి పెరిగేందుకు కారణాలుగా ఉంటున్నాయి.* పిల్లలు ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే.. ముందుగానే పక్కా ప్రణాళికతో అన్ని పాఠాలను చదివి ఉండాలి. ఎక్కువ మార్కులు వచ్చే పద్ధతిలో ప్రాక్టీసు చేసి ఉండాలి. వేగంగా రాయటం అలవాటు చేసుకోవాలి. బాగా రాయలేనేమోనన్న భావనలను దరిదాపుల్లోకి కూడా రానీయకూడదు. సంవత్సరమంతా చదివినా నేనెందుకు రాయలేను అన్న ధీమాతో, పూర్తి విశ్వాసంతో పరీక్షకు హాజరవ్వాలి. ఇలా విశ్వాసంతో ఉంటే ఎలాంటి ఒత్తిడీ పిల్లలను బాధించదు.