జో అచ్యుతానంద జో జో ముకుందా అంటూ సాగే జోల పాటకు పరవశించని శిశువు ఉండరు. రాగయుక్తంగా పాడితే శిశువు హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. అందుకే పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు ఈ గీతాన్ని ప్రపంచానికి అందించే క్రమంలో అంతటి శ్రీ వేంకటేశ్వరుడిని సైతం నిద్రపుచ్చాడు. తాళ్ళపాక వారి లాలిపాటలకు ఎంత మహత్తో మనకందరికీ బాగా తెలిసేవుంటుంది.
తాజాగా జోల పాటలు శిశువు ఆరోగ్యాన్ని మేలు చేస్తాయని పరిశోధకులు కనుకొన్నారు. నేటి పరిశోధకులు సైతం కమ్మని జోలపాటల్లోని మెత్తదనంలో ఏదో మహత్తు ఉందంటున్నారు. అందుకే, నెలలు తిరగకముందే పుట్టిన శిశువులకు జోలపాటలు ఆరోగ్యాన్నిస్తాయని సూచిస్తున్నారు. ఆ పసికందును తల్లి పొదివి పట్టుకుని ఓ పాట అందుకుంటే తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యమూ మెరుగవుతుందట. ముఖ్యంగా వారి హృదయస్పందన సాఫీగా సాగుతుందట.
ఇజ్రాయెల్‌లోని మీర్ ఆసుపత్రిలో 86 తల్లి-బిడ్డల జోడీలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలియవచ్చింది. ఇలా తల్లి తన బిడ్డను హత్తుకోవడాన్ని వారు 'కంగారూ కేర్' గా అభివర్ణిస్తున్నారు.