సమయం వృధా కాకుండా ఇలా చేసి చూడరూ..?!
* స్కూలుకి బస్‌లో వెళ్తున్నప్పుడు నిద్రపోవటమో, వీధుల్ని, జనాలను పరిశీలించటమో, మిత్రులతో తగవు పెట్టుకోవటమో లాంటివి చేయకుండా.. కళ్లు మూసుకుని ముందురోజు టీచర్ చెప్పిన పాఠ్యాంశాలను గుర్తుకు తెచ్చుకోవటం చాలా మంచి పద్ధతి. అలాగే ఆ పాఠాలలో వచ్చే పటాలను ఊహించుకోవటం వల్ల ఫొటోగ్రఫిక్ మెమొరీ సామర్థ్యం పెరిగేందుకు దోహదపడుతుంది.* బడి నుంచి రాగానే హోమ్‌వర్క్ చేయడం సమంజసం కాదు. అసలే బడలికతో వచ్చే పిల్లలు కాసేపు ఆటలాడుకుని ఆ తర్వాత స్నానంచేసి, ఏదైనా టిఫిన్ తిన్న తరువాతనే హోమ్‌వర్క్ చేసేందుకు పూనుకోవాలి. హోమ్‌వర్క్ చేసేటప్పుడు ఒక నిమిషంలో చేసే పనికి ఐదు నిమిషాలు వెచ్చిస్తే సమయం వృధా అవుతుంది. కాబట్టి హోమ్‌వర్క్ చేసేందుకు కొంత సమయం కేటాయించుకుని ఆ సమయంలోనే పూర్తయ్యేలా వేగంగా రాయటం అలవాటు చేసుకోవాలి. * వారానికి పది గంటలకంటే అధికంగా టీవీ, కంప్యూటర్లను వీక్షించడం కంటి ఆరోగ్యానికీ క్షేమకరం కాదు. కాబట్టి టీవీలో ఏ కార్యక్రమాలను చూడాలో ముందే నిర్ణయించుకోవాలి. ఏఏ పనులను చేయాలో సిద్ధపడి కంప్యూటర్ ముందు కూర్చోవాలి. ప్రతిరోజూ నిద్రించేముందు, ఆ రోజు మనం చేసిన పనులను, కాల వినియోగాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. తర్వాతి రోజు సమయాన్ని వృధా చేయకుండా మన కార్యక్రమాల ప్రణాళిక వేసుకోవాలి. ఇలా చేయటంవల్ల సమయం వృధా కాదు, విజయాలు మీ వెంటే ఉంటాయి.