Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో స్విమ్మింగ్ పూల్‌లో పిల్లల ఈత.. జాగ్రత్తలు

Advertiesment
పిల్లలు
FILE
వేసవి వచ్చిందంటే చాలు. నగరాలు, పట్టణాల్లో ఉన్న ఈత కొలనులు పిల్లల కేరింతలతో మహా బిజీగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు కూల్ కూల్‌గా కొలనుల్లో ఈత కొట్టేందుకు ఉరకలు వేస్తారు. పిల్లలు ఉత్సాహాన్ని కాదనలేని పెద్దలు వారిని కొలనుల్లో జలకాలాటలకు అనుమతి ఇస్తారు. అయితే స్విమ్మిగ్ పూల్స్‌లోకి ఈత కొట్టేందుకు పిల్లలను అనుమతించే ముందు కొన్ని అంశాలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవాలి.

వేసవిలో చాలామంది పిల్లల్లో కనిపించే వ్యాధి డయారియా. ఈ వ్యాధి ఉన్న పిల్లలు కనుక ఈత కొలనుల్లో జలకాలాడితే... ఆ వ్యాధి ఇతర పిల్లలకు వ్యాపించడం చాలా సులభమంటున్నారు వైద్యులు. కనుక ఈత కొలనుల్లోకి వెళ్లేముందు పిల్లలను ఒకసారి వైద్యుని చూపించడం అవసరమంటున్నారు. ఈత కొట్టడానికి కూడా వైద్యులను సంప్రదించాలా...? అనుకోకూడదు. ఎందుకంటే ఎవరి పిల్లల ఆరోగ్యమైనా ముఖ్యమే కదా.

ఇక మీ పిల్లలను ఈత కొలనుల్లోకి అనుమతించేటపుడు తప్పనిసరిగా ఈ క్రింది సూచనలను పాటించాలంటున్నారు వైద్యులు. పిల్లలకు డయారియా ఉన్నట్లు తేలితే వారిని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దు. ఈతకొట్టేటపుడు కొలనులోని నీటిని ఎట్టి పరిస్థితుల్లో నోటిలో పుక్కిలిపడుతూ ఉండకూడదని చెప్పాలి.

ఒకవేళ పొరపాటున నీళ్లు గొంతులోకి వచ్చినట్లయితే వాటిని వెంటనే ఉమ్మి వేయమని చెప్పాలి. కొలనులోకి దూకేటపుడు ముక్కు మూసుకుని దూకమనండి. అలా చేయడం వల్ల జలుబు వంటి వ్యాధులు దరిచేరవు. చెప్పాల్సిన మరో విషయం ఏమిటంటే... స్విమ్మింగ్ పూల్‌లో రకరకాల వ్యక్తులు, రకరకాల వ్యాధులు ఉన్నవారు స్నానమాచరిస్తారన్న విషయం.

ఇక ఈత కొలనులో జలకాలాటకు ముందు మరుగుదొడ్లకు వెళ్లి వస్తే చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కుని స్విమ్మింగ్ చేయమనండి. అలా శుభ్రం చేసుకోకుండా ఈతకు దిగితే మరుగుదొడ్లలో ఉండే రోగకారక క్రిములు ఈత కొలనులోకి చేరుతాయి. తద్వారా వ్యాధులు సంక్రమించడం చాలా తేలిక.

మీ పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్లే ముందు కొలనులోని నీరు శుభ్రంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. శుభ్రంగా ఉన్నట్లయితే నీటి మీద తెట్టు వంటి పొర కనబడ కూడదు. తెట్టులాంటి పొర కనిపిస్తే, పూల్ యజమానికి ఫిర్యాదు చేసి నీటిని శుభ్రపరచమని చెప్పండి. మరో విషయం ఏమిటంటే... స్విమ్మింగ్ పూల్‌లో అడుగున ఉన్న భాగం మీకు స్పష్టంగా కనిపిస్తుండాలి. లేదంటే ఆ నీటిలో ఏదో తేడా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

అన్నిటికీ మించి ఈత కొలనులోని నీటిని క్లోరిన్‌తో శుభ్రం చేయడం ఉత్తమం. మీ పిల్లలను ఈత కొలనుల వద్దకు తీసుకవెళ్లే ముందు వాటిని నిర్వహిస్తున్న యాజమాన్యం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందో ఆరా తీయండి. ఆ తర్వాతే పిల్లలను కొలనుల్లోకి స్వేచ్ఛగా వదిలేయండి.

Share this Story:

Follow Webdunia telugu