పిల్లల ప్రశ్నలను మొగ్గలోనే తుంచేయకండిలా..!!
* చిన్నతనంలో ప్రతిదాన్ని ఆసక్తిగా గమనించే పిల్లలు, వారికి అర్థంకాని విషయాలుంటే వెంటనే తల్లిదండ్రులవద్ద ప్రశ్నించటం షరా మామూలే. అయితే పిల్లల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చే తల్లిదండ్రులకంటే, విసుక్కునేవారే అధికం. అయితే ప్రశ్నించటం, కొత్త విషయాలను తెలుసుకోవాలనుకోవటం అనేవి వ్యక్తిత్వ వికాసానికి చిహ్నాలుగా గుర్తించి, తల్లిదండ్రులు పిల్లలకు జవాబులను విడమర్చి చెప్పటం అవసరం.* పిల్లల్లో కలిగిన సందేహాలకు, సమాధానాలను ఓపికగా విడమర్చి అర్థమయ్యే రీతిలో తెలియజెప్పాలి. వాటిమీదే పిల్లల వ్యక్తిత్వ వికాసం ఆధారపడి ఉంటుందన్న సంగతిని పెద్దలు గుర్తుపెట్టుకుని నడచుకోవాలి. టీనేజీ పిల్లల సందేహాలను తల్లిదండ్రులే గుర్తించి, వారి వయస్సుకు తగిన సమాచారాన్ని అందిస్తూ, సందేహాలను తీర్చాలి. లేదా వారి సందేహాలు తీరే సరైన మార్గాలనైనా చూపించాలి.* మనసు ఆధీనంలో ఉంచుకునే విధానాన్ని విడమర్చి చెప్పాలి. మంచిచెడులను సైతం బేరీజు వేసుకునే విచక్షణను పిల్లలకు నేర్పించాలి. ఎలాంటి సందేహాలనయినా అడిగి తెలుసుకోవచ్చు, ఎలాంటి విషయాలనైనా తల్లిదండ్రులవద్ద పంచుకోవచ్చు అనే భరోసాను పిల్లలకు పెద్దలు కలిగేలా చేయాలి.