పిల్లల్లో ఊబకాయాన్ని నియంత్రించడం ఎలా..!?
, బుధవారం, 7 నవంబరు 2012 (17:44 IST)
పిల్లల్లో ఊబకాయాన్ని నియత్రించడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పిల్లలకు కొవ్వు పదార్థాలు అధికంగా గల ఆహారాన్ని ఇవ్వడం ద్వారా టైప్-2 డయాబెటిస్, నిద్రలేమి, హృద్రోగ సంబంధిత రోగాల బారిన పడతారని వారు హెచ్చరిస్తున్నారు. కానీ పిల్లలు కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోనివ్వకుండా చేయడం చాలా కష్టం. అధికమైన ఆహారం తీసుకోవడం, కేకులు, పిజ్జాలు వంటి ఆహారాన్ని తీసుకోవడంతోనే చిన్నారులను ఊబకాయం వెంటాడుతోంది. పిల్లల బరువును అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. పిల్లల ఎత్తుకు తగ్గట్టు బరువు ఉందా అనేది చూసుకోవాలి. పిల్లలను రోజు ఆడుకునేలా చూడాలి. టీవీ చూడటం, వీడియో గేమ్స్‌కే వారిని పరిమితం చేయకూడదు. జాగింగ్, రన్నింగ్, జంపింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లో పిల్లలు పాల్గొనేలా చేయాలి.ఫాస్ట్‌ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ఫ్రైయిడ్ చికెన్, మిల్క్‌షేక్ వంటివి పిల్లలకు ఇవ్వకండి. వీటిలో కొవ్వు పదార్థాలు ఎక్కువ. వీటిని అధికంగా తీసుకోవడం ద్వారా పిల్లలు భవిష్యత్తులో హృద్రోగ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉంది. అధిక కొవ్వు పదార్థాలు గల పాలు కంటే లో-ఫాట్ గల పాలను ఇవ్వడం శ్రేష్టం. ఊబకాయం కలిగివుండే పిల్లలు అతి త్వరలోనే మానసిక ఒత్తిడికి గురవుతారు. కొవ్వు కలిగిన పదార్థాల కంటే పండ్లు, కూరగాయలను సలాడ్‌లా తయారు చేసి ఇవ్వడం మంచిది. ఇలా చేస్తే పిల్లల్లో ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు.