పిల్లలు ఏదైనా తప్పు చేసినా, విసిగించినా గబుక్కున చేతిని లేపడం సహజంగా పెద్దవాళ్లకు ఉండే అలవాటు. అయితే పిల్లల్ని తరచూ కొడుతుండటం వల్ల ఐదేళ్ల వయసు వచ్చేసరికి వాళ్లు బాగా దురుసుగా అయ్యే అవకాశాలున్నాయని పరిశోధకులు గుర్తించారు.
ముఖ్యంగా మూడేళ్ల వయస్సులో పిల్లల్ని తరచుగా కొడుతుంటే ఎదిగేకొద్దీ వారిలో దురుసు ప్రవర్తన ప్రబలుతుంది. మరీ చిన్నతనంలో కనుక పిల్లల్ని కొట్టినట్లయితే వారికి మూడేళ్ల వయస్సు వచ్చేసరికి దెబ్బలు తినని పిల్లలతో పోల్చితే జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది.
అయితే దురుసుగా వ్యవహరించే పిల్లలంతా చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో దెబ్బలు తిన్నవారేనని అంచనా వేయకూడదు. దురుసుతనానికి ఇదో కారణం. హింసాత్మక ధోరణితో వ్యవహరించడాన్ని తాము తిన్న దెబ్బలు ప్రభావితం చేస్తాయన్నది నిపుణుల అభిప్రాయం. ఎంత విసిగించినా చెయ్యి ఎత్త వద్దని ఆంక్షలు పెట్టుకోవడం ఆచరణలో కొంచెం కష్టమే కానీ, వీలైనంతవరకు నియత్రణ చేసుకోవడమే మంచిది.