అమ్మాయిలకు "మార్షల్ ఆర్ట్స్" నేర్పించవచ్చా..?
* అమ్మాయిలకు "మార్షల్ ఆర్ట్స్" తప్పకుండా నేర్పించాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఇది చేసేటప్పుడు పద్దతి ప్రకారం చేస్తారు. కాబట్టి వాళ్ళలో ఏదైనా ఒక పద్దతిలో చెయ్యాలనే క్రమశిక్షణ వస్తుంది. త్వరగా స్పందించే గుణం పెంపొందుతుంది. తెలియనివారెవరైనా కొట్టడానికి ప్రయత్నిస్తే వెంటనే రియాక్ట్ అవుతారు.* మార్షల్ ఆర్ట్స్ క్లాసుల్లో చేరగానే ముందుగా కోచ్ సీనియర్స్‌కు, ట్యూటర్స్‌కు వంగి నమస్కారం చెయ్యడం నేర్పుతారు. దీనివల్ల అందరినీ గౌరవించడం, స్నేహపూరితంగా మెలగడం నేర్చుకుంటారు. ముఖ్యంగా ఆత్మరక్షణ కొరకే నేర్చుకునే ఈ మార్షల్ ఆర్ట్స్ వల్ల శరీరంలోని ప్రతి భాగాన్ని ఒక ఆయుధంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. మోచేతులు, మోకాళ్ళు, పిడికిలి, కాళ్ళు, అరచేతులు... ప్రతి భాగంతో ఎలా శత్రువు దాడిని ఎదుర్కోవచ్చో నేర్చుకుంటారు.* ప్రతిరోజూ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చెయ్యడం వల్ల కండరాలు ధృడమవుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. మార్షల్ ఆర్ట్స్‌ను నేర్పించడం ఏడేళ్ళ వయసునుంచే మొదలు పెడితే బాగుంటుంది. కరాటే నేర్చుకున్న అమ్మాయిల్లో చాలామంది తమను తాము రక్షించుకోగలమనే ఆత్మ విశ్వాసం పెరిగినట్లు కరాటే నిపుణులు అంటున్నారు. తమపట్లే కాకుండా, తమ స్నేహితుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి విషయంలో కూడా వీరు మిగతా పిల్లలతో పోల్చితే త్వరగా స్పందించగలుగుతారని వారు చెబుతున్నారు.