డీఎండీకే అధినేత విజయకాంత్ కు ఏమైంది...? ఆదివారం ఉదయం ముఖంపై గుడ్డను కప్పి వీల్ ఛైర్లో ఆయనను మీనంబాక్కం విమానశ్రయం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆయనను మరింత దగ్గరగా వెళ్లి మాట్లాడాలనుకునేలోపే ఆయనను కారు ఎక్కించి వేగంగా వెళ్లిపోయారు ఆయన సిబ్బంది. అసలు ఆయనకు ఏమైందన్న ఆందోళనలో విజయకాంత్ పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. ఆయనకు ఏమయినా శస్త్ర చికిత్స జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. మరోవైపు ఆయన పార్టీ 2014 ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడంతో ఆయన ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారన్న ప్రచారమూ జరిగింది. అదలావుండగానే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు వ్యాపించాయి. దీనికి బలాన్ని చేకూరుస్తూ ఆయనను చెన్నైలో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు చేర్పించారు. దీంతో కార్యకర్తలంతా ఆ ఆస్పత్రి ముందు బారులు తీరారు.
తనకు అనారోగ్యం ఏమీ లేదని ఆయన చెప్పాకే అంతా వెళ్లిపోయారు. కానీ హఠాత్తుగా విజయకాంత్ సింగపూర్ వెళ్లారు. దీనితో ఆయనకు మళ్లీ ఏమైందన్న ఆందోళన కలిగింది. ఆదివారంనాడు ఆయన ముఖంపై గుడ్డను కప్పి వీల్ చైర్లో నెట్టుకొస్తూ ఉన్న స్థితిని చూసి మీడియా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విజయకాంత్ భార్య ఆయనను కారులో ఇంటికి తీసుకెళ్లిపోయారు. విజయకాంత్ పరిస్థితి ఏమిటన్న సందిగ్ధంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు.